నేడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేపట్టింది. కీవ్ నడిబొడ్డున పేలుళ్ల మోత వినిపించిందని నగర మేయర్ విటాలీ క్లిచ్కో వెల్లడించారు. సెంట్రల్ షెవ్ చెంకివ్ స్కీ జిల్లా పేలుళ్లతో దద్దరిల్లిందని, అత్యవసర బృందాలను వెంటనే తరలించామని చెప్పారు. రాజధాని కీవ్ లో పేలుళ్లపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. రష్యా దాడులకు ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ దీటుగా బదులిచ్చిందని తెలిపారు. ఈ ఉదయం జరిగిన దాడుల్లో 13 ఇరాన్ తయారీ షాహెద్ డ్రోన్లను తమ బలగాలు కూల్చివేశాయని ప్రకటించారు.
కీవ్ లో ఒక్కసారిగా గగనతల దాడుల సైరన్ మోగడంతో నగరంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. రష్యా డ్రోన్లు కీవ్ నగరంలోని ఓ పరిపాలనా భవనంతో పాటు, నాలుగు నివాస సముదాయాలను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని, షెల్టర్లకు తరలివెళ్లాలని కీవ్ గవర్నర్ కులేబా సలహా ఇచ్చారు. ఉక్రెయిన్ విద్యుత్, ఇంధన, మౌలిక సదుపాయాల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ దాడులు చేపట్టింది.