న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునః ప్రారంభ తేదీ వాయిదా పడింది. అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుకు సంబంధించి వాదనలు ఉండడంతో యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని టీడీపీ ముఖ్య నేతలు లోకేష్‌ను కోరారు. చంద్రబాబు అరెస్ట్, అనంతర పరిణామాలతో ఈనెల 9న తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో లోకేష్ పాతయాత్రను నిలిపివేశారు. సెప్టెంబర్ 29వ తేదీ రాత్రి పాదయాత్ర తిరిగి ప్రారంభించాల్సి ఉంది.
సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసుకు సంబంధించి గత కొద్దికాలంగా లోకేష్ ఢిల్లీలోనే ఉంటున్నారు. వచ్చే మంగళవారం కేసు విచారణ ఉంది. లోకేష్ పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, తీసుకోవాల్సిన చర్యలు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టమయ్యే అవకాశం ఉందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో నేటి నుంచి తిరిగి ప్రారంభం కావాల్సిన యువగళం పాదయాత్రను వాయిదా వేశారు. త్వరలోనే మరోసారి సీనియర్ నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించాలని లోకేష్ నిర్ణయం తీసుకున్నారు.