Friday, November 22, 2024

Delhi | మహిళా బిల్లుకు స్వాగతం : వైఎస్సార్సీపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తున్నామని వైఎస్సార్సీపీ ప్రకటించింది. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లును ఇప్పుడు ప్రవేశపెట్టినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి పదవులు, పథకాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఆవరణలోనే మీడియాతో మాట్లాడిన ఆయన.. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం తాము మొదటి నుంచి పట్టుబడుతున్నామని గుర్తుచేశారు.

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని స్థానిక సంస్థల్లో చట్ట ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం 50 శాతం మహిళలకు కేటాయించి అమలు చేసిందని తెలిపారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లో 50 శాతం వరకు మహిళలు ఉన్నారని వెల్లడించారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అధ్యయనం చేస్తామని, ఆ మేరకు బిల్లును మరింత మెరుగుపరిచేందుకు తగిన సూచనలు కూడా చేస్తామని చెప్పారు.

బిల్లుపై చర్చకు 6 గంటల సమయం కేటాయించారని, ఆ చర్చలో కూడా తమ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు పాల్గొంటారని వెల్లడించారు. బిల్లు త్వరగా అమలుకావాలన్నదే తమ అభిమతని చెప్పారు. బిల్లులోని అంశాలపై విభేదాలు రావచ్చేమో కానీ అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతాయని తాను భావిస్తున్నానని అన్నారు.

27 సంవత్సరాల కల – వంగా గీత

కొత్త పార్లమెంటులో మొట్టమొదటి బిల్లు మహిళా రిజర్వేషన్ల బిల్లు కావడం తనకు చాలా సంతోషంగా ఉందని కాకినాడ ఎంపీ వంగా గీత (వైఎస్సార్సీపీ) అన్నారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా తాను ప్రధాన మంత్రి సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు లేఖలు రాశానని, వాటిలో కొత్త భవనంలో మొదటి బిల్లు మహిళా బిల్లు పెట్టాల్సిందిగా కోరానని గుర్తుచేశారు.

- Advertisement -

భారతదేశంలో శుభకార్యాలను ఆ ఇంటి ఆడపడుచుతోనే ప్రారంభిస్తామని, ఆ సాంప్రదాయాన్ని అనుసరించి కొత్త భవనంలో మహిళల అంశంతోనే మొదలుపెడితే బావుంటుందని ఆమె అన్నారు. ఇక పాత పార్లమెంట్ భవనంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నా ఆమె, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాత పార్లమెంటు భవనంతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని తెలిపారు. రాజ్యసభతో పాటు ప్రస్తుతం లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నానని, రెండు సభలతోనూ తనకు అనుబంధం ఉందని అన్నారు.

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన పరిణామాలకు పాత పార్లమెంట్ భవనం సాక్షిగా నిలిచిందని వంగా గీత వ్యాఖ్యానించారు. కొత్త పార్లమెంటులో కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. మొత్తంగా 27 సంవత్సరాలుగా పార్లమెంటులో ఆమోదానికి నోచుకోకుండా మిగిలిపోయిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఈసారైనా మోక్షం లభిస్తుందని ఆశిస్తున్నానని ఆమె అన్నారు.

సువర్ణాధ్యాయం – డా. సత్యవతి

తాను ఎంపీగా ఉన్న సమయంలోనే వందేళ్ల చరిత్ర కల్గిన పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని అనకాపల్లి ఎంపీ డా. సత్యవతి (వైఎస్సార్సీపీ) వ్యాఖ్యానించారు. పార్లమెంట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి తెరపడింది, మరో కొత్త చరిత్రకు నాంది పడిందని అన్నారు. పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లడం పట్ల ఎంపీలంతా ఉద్వేగానికి లోనయ్యారని ఆమె తెలిపారు. సభా కార్యాకలాపాల్లో మొదటి అంశంగానే మహిళా బిల్లును లోక్ సభలో పెట్టడం, దానికి అందరిని సహకారం కావాలని ప్రధాని కోరడం సంతోషం కలిగించిందని అన్నారు.

ఇప్పటికే అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారని, మహిళా సమస్యలు పార్లమెంట్ లో ప్రస్తావించాలంటే కనీసం మూడో వంతైనా పార్లమెంట్ లో మహిళల ప్రాతినిధ్యం ఉండాలని డా. సత్యవతి అన్నారు. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు ఇంతకాలం పెండింగులో ఉండిపోయిందని అన్నారు. కొత్త పార్లమెంట్ లో మహిళలకు కానుకగా మహిళా బిల్లు ప్రవేశ పెట్టడం సంతోషం కలిగించిందని అన్నారు. అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement