Tuesday, November 26, 2024

విభజన అంశాలు, బడ్జెట్ కేటాయింపులపై పోరాడతాం.. స్పష్టం చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలు, బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులపై గట్టిగా పోరాటడతామని వైఎస్సార్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సోమవారం ఆ పార్టీ లోక్‌సభ సభ్యులు డాక్టర్ గురుమూర్తి, లావు శ్రీకృష్ణదేవరాయలు న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ… 2019లో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి‌ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. సీఎం ఆదేశాలపై పార్లమెంట్ ఉభయసభలలో సమస్యలు లేవనెత్తుతున్నామని చెప్పారు. కేంద్రమంత్రులను కలిసి మా ప్రాంతాల రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్‌లో మత్స్యకారులకు సంబంధించి పులికాట్ సరస్సు మౌత్ ఓపెనింగ్ సమస్యగా మారిందని వెల్లడించారు.

ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి బస్టాండ్‌ను మోడల్ బస్టాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సమర్పించామని, దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరామని గురుమూర్తి తెలిపారు. ఒక మోడల్ తయారు చేసి రూ. 500 కోట్లతో ప్రపోజల్ ఏప్రిల్‌లో ప్రతిపాదన ఇచ్చే అవకాశముందన్నారు. తిరుపతి సైన్స్ సెంటర్ పక్కన ప్లానిటోరీయం ఏర్పాటుకు కేంద్రం రెండెకరాల స్థలం అడిగిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాను కలిసి నేషనల్ ఫోరెన్సీక్ యూనివర్సిటీ తిరుపతికి మంజూరు చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి రోప్ వే ప్రతిపాదన కూడా ఆమోదం పొందిందని ఎంపీ వివరింమచారు. తన నియోజకవర్గ పరిధిలో నైలిట్ విద్యాసంస్థల ఏర్పాటుకు భవనాలను గుర్తించామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపి అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని గురుమూర్తి పేర్కొన్నారు.

పోరాడతాం-సాధిస్తాం : ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు

- Advertisement -

విభజన చట్టంలోని అంశాలు, ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్ కేటాయింపులపై ప్రత్యేక దృష్టి పెడతామని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కేవలం భూసేకరణ అంశాన్ని చూపించి రైల్వే ప్రాజెక్ట్‌లు చేపట్టకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి కేటాయించిన హైవే ప్రాజెక్ట్‌లు త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్రమంత్రులను కోరామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. వినుకొండలో లేని దాన్ని ఒక మీడియా వక్రీకరణ చేసి చూపిస్తోందని ఆరోపించారు. ఫొటోలో, వీడియోలో ఉన్నామా అన్నది కాదు. పార్లమెంట్‌లో దేనిపై పోరాటం చేశామన్నదే అవసరమని ఆయన స్పష్టం చేశారు. తాను చంద్రబాబును గానీ, వేరెవరిని గానీ కలవలేదని తెలిపారు. అనవసర విషయాలపై మీడియా అతిగా ప్రచారం చేసి ప్రజల సమయం వృథా చేయవద్దని ఎంపీ సూచించారు. ఎంపీ అయ్యింది ప్రజల సమస్యలు తీర్చడానికే గానీ మీడియాలో కనిపించడానికి, ప్రచారం కోసం కాదని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement