Tuesday, November 19, 2024

YSRCP – బ‌స్సు యాత్ర‌తో క‌దిలిన జ‌గ‌న్‌ – ఇడుపుల‌పాయ టు ఇచ్చాపురం ప్రచార భేరి..

అడుగ‌డుగునా జగన్ యాత్రకు బ్రహరథం
వైఎస్సార్ ఘాట్‌లో తండ్రి సమాధికి నివాళి
ప్రత్యేక ప్రార్థనలు చేసిన తల్లి విజయమ్మ
అనంతరం సర్వమత ప్రార్థనలు
వేదమంత్రోచ్ఛారణలతో 1.40 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం
రోడ్డుకు ఇరువైపుల బారులు తీరిన ప్రజలు
జై జగన్ అంటూ జననీరాజనం

కడప బ్యూరో, (ప్రభ న్యూస్) : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర బుధ‌వారం ప్రారంభమైంది. కడప జిల్లా ఇడుపుల‌పాయ‌లోని వైఎస్సార్ ఘాట్ నుంచి మధ్యాహ్నం 1.40 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. అంతకముందు జ‌గ‌న్ త‌న తండ్రి వైఎస్సార్ ఘాట్ వ‌ద్ద నివాళుల‌ర్పించారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు చేయ‌గా.. తల్లి విజయమ్మ, పార్టీ నేతలు పాల్గొన్నారు. విజ‌య‌మ్మ ప్ర‌త్యేక ప్రార్థ‌న చేసి కుమారుడికి ఆశీస్సులు అందించారు. అనంత‌రం జగన్‌ బస్సు యాత్రను ప్రారంభించారు. దీంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర.. బహిరంగ సభలతో 21 రోజుల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండనున్నారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా..

తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో జరుగుతోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజులపాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం వైఎస్ జగన్‌ మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 1.40 గంటలకు ఇడు­పు­లపాయలో ప్రారంభమైన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమలాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రోడ్డు ఇరువైపులా నిల్చుని జగన్ కు అభివాదం చేస్తూ జై జగన్.. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలుకుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement