Saturday, November 23, 2024

YSRCP – అచ్యుతాపురం బాధిత కుటుంబాలు వైసిపి ఆర్థిక సాయం – బొత్స

విశాఖపట్నం – అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఎసెన్షియా ప్రమాదంలో మృతుల కుటుంబాలకు వైసీపీ పార్టీ తరపున 5లక్షలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. గాయపడ్డ వారికి లక్ష రూపాయలు ప్రకటించినట్లు వైసీపీ తరఫున ఆయన పేర్కొన్నారు. విశాఖలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, బాధితులను కలిసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు

పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఎక్కడ బాధితులు వుంటే అక్కడ స్థానిక నాయకత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. అనకాపల్లిలో బాధితుల పరామర్శకు వచ్చి జగన్మోహన్‌ రెడ్డి చేసిన సూచనలపై ప్రభుత్వంలో వున్న వాళ్ళు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

బాధితులకు తక్షణం భరోసా కల్పించడంలో టీడీపీ నాయకత్వం వైఫల్యాన్ని జ‌గ‌న్ చెప్పారని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మీద స్థాయి మరిచిపోయి చేస్తున్న విమర్శలు అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని బొత్స వెల్లడించారు. రాళ్లు విసిరితే కాచుకోవడానికి మేము సిద్ధమని….కానీ బాధ్యతలు మరిచిపోయి వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసిన తర్వాతే ముఖ్యమంత్రి కేజీహెచ్‌కు వచ్చారన్నారు. ఇంత ప్రమాదం జరిగితే ఎన్విరాన్ మెంట్, లేబర్, ఇండస్ట్రీస్ మినిస్టర్లు ఎక్కడికిపోయారు…? వాళ్లకు ప్రభుత్వంతో సంబంధం లేదా..? అంటూ బొత్స ప్రశ్నించారు. మార్చురీ దగ్గర టెంట్ వేసి.. బాధితులకు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదని మండిపడ్డారు.

వైఫల్యాలను ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని అన్నారు. పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగితే ధర్నా చేస్తామని జ‌గ‌న్ అన్నారని తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కనిపించడం లేదని ప్రభుత్వం చెప్పడం ఏంటి?.. ఎక్కడ ఉన్నా పిలకపట్టుకుని లాక్కుని రావలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. పరిహారం విషయంలో సందిగ్ధత కారణంగానే జ‌గ‌న్ ధర్నా చేస్తామన్నారని తెలిపారు.

ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతామన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన వెంటనే విష వాయువుల వ్యాప్తికి అవకాశం వున్న స్టెయిరీన్‌ను యుద్ధ ప్రాతిపదికన ఓడల ద్వారా తరలించామన్నారు. ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న విమర్శలను ఆపాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీ . వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూన ప్రసాద్పై దారికాచి టీడీపీ వాళ్లు దాడి చేశారని.. హత్య రాజకీయాలను ఆపాలని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇలాంటివి ఎన్నడూ జరగలేదన్నారు. ఈ హత్యలో 15 మంది ఉన్నారని వారందరిపైన 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement