వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్ అయ్యారు. హైదరాబాదులో ఆరేళ్ల బాలికపై హత్యాచార ఘటనను మరువకముందే తాగుబోతుల చేతిలో మరో మహిళ బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ దొరగారి పాలనలో గల్లీకో వైన్స్, వీధికో బార్ ఉందని… ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోందని అన్నారు. తెలంగాణను కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. ఆరేళ్ల పాప నుంచి 60 ఏళ్ల ముసలి అని చూడకుండా తాగిన మత్తులో మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే… తనకేమీ పట్టనట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఆడపిల్లల మాన, ప్రాణాలను పణంగా పెట్టి… అటు లిక్కర్ ఆదాయాన్ని, ఇటు మహిళలపై అఘాయిత్యాలను కేసీఆర్ 3 వందల రెట్లు పెంచారని షర్మిల విమర్శించారు. ‘అయ్యా దొరా… చూడు. నువ్వు చేసిన బారుల తెలంగాణ, బీరుల తెలంగాణలో మహిళల మాన, ప్రాణాలకు దొరుకుతున్న రక్షణ’ అంటూ ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇది కూడా చదవండి: అమ్మో పెద్దపులి: చెట్టెక్కిన పశువుల కాపర్లు