Saturday, June 29, 2024

Delhi | హస్తినలో వైఎస్ షర్మిల.. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థులపై కసరత్తు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తు కాంగ్రెస్ అధిష్టానం చేపట్టింది. ఆదివారం రాత్రి గం. 8.30 సమయంలో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్‌లో స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీ కోసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో షర్మిలతో పాటు కమిటీ సభ్యులు సూరజ్ హెగ్డే, మేయప్పన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగూర్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరా రెడ్డి, సీనియర్ నేత కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రధానంగా పోటీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్, మూడు పార్టీల ఎన్డీఏ కూటమి మధ్యనే ఉండడంతో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు కరవయ్యారు. కనీసం జిల్లాకు ఒక పెద్ద నేత కూడా లేని పరిస్థితులు ఆ పార్టీలో ఉన్నాయి. రాష్ట్రంలో ఇతర పార్టీల్లో టికెట్ లభించక అసంతృప్తికి గురైన అసమ్మతి నేతలు సైతం కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పార్టీ కోసం చాలాకాలంగా పనిచేస్తున్న సామాన్య కార్యకర్తలకు ఈసారి అవకాశం లభిస్తోంది. రాష్ట్రం మొత్తమ్మీద ఆ పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతల సంఖ్య రెండంకెల్లో కూడా లేదు.

పేరున్న నేతలంతా వివిధ ప్రాంతీయ పార్టీల్లో చేరిపోవడం కారణంగా ప్రభావవంతమైన నేతలు లేక పార్టీ అభ్యర్థుల కోసం దిక్కులు చూస్తోంది. ఉమ్మడి జిల్లాల లెక్కన చూస్తే శ్రీకాకుళం జిల్లాలో బొడ్డెపల్లి సత్యవతి తప్ప మరో నేత కనిపించడం లేదు. బొత్స కుటుంబం వైఎస్సార్సీపీలో చేరడంతో విజయనగరంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నేతలే కరవయ్యారు. విశాఖపట్నం నుంచి వయోవృద్ధుడైన మాజీ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి మినహా ఇంకెవరూ కనిపించడం లేదు. ఆయన కూడా వయోభారం దృష్ట్యా పోటీకి సుముఖంగా లేరు.

తూర్పు గోదావరి జిల్లాలో జీవీ హర్షకుమార్, ఎంఎం పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, ఎస్.ఎన్, రాజు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కనుమూరి బాపిరాజు తప్ప మరొకరు లేరు. ఈ జిల్లాకే చెందిన నేత జెట్టి గురునాథరావు రాజీనామా చేయడంతో పశ్చిమగోదావరి జిల్లా కూడా దాదాపు ఖాళీగా కనిపిస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన కొప్పుల రాజు జాతీయస్థాయిలో ఉన్నప్పటికీ జిల్లాలో ఆయన ప్రభావం శూన్యం. అలాగే కేవీపీ రామచంద్రరావు వంటి సీనియర్ నేతతో పాటు నరహరిశెట్టి ఈ జిల్లాకు చెందినవారే.

అయినా సరే ఆ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. గుంటూరు జిల్లాలో షేక్ మస్తాన్‌వలీ, లింగంశెట్టి ఈశ్వరరావు కనిపిస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రి జేడీ శీలం తప్ప ఇంకెవరూ లేరు. ఆయన ప్రభావం జిల్లా రాజకీయాల్లో తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఆ పార్టీ ఊసే కనిపించడం లేదు. కడప జిల్లాలో వైఎస్ షర్మిల, డా. ఎన్. తులసి రెడ్డి ఉన్నప్పటికీ.. వైఎస్సార్సీపీని ఢీకొట్టగలరా అన్నది ప్రశ్నార్థకమే. రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాలు కల్గిన చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి చింతా మోహన్ తప్ప ఇంకెవరూ లేరు.

- Advertisement -

అనంతపురం జిల్లాలో ఎన్. రఘువీరా రెడ్డి, డా. సాకె శైలజానాథ్, మడకశిర సుధాకర్ తప్ప చెప్పుకోదగ్గ నేతలు లేరు. వీరిలో కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నప్పటికీ.. గెలుపొందుతామన్న నమ్మకం ఎవరిలోనూ కనిపించడం లేదు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఘోర పరాజయాలు చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా పరాభవం తప్పేలా లేదు. అయితే షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొంత ఊపు కనిపించినప్పటికీ… ప్రధాన పార్టీల పోటీ మధ్య కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థులను వడపోసి, సోమవారం జరగనున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి జాబితాను అందించేందుకు కసరత్తు పూర్తి చేశారు. సోమవారం కాంగ్రెస్ సీఈసీ భేటీ అనంతరం ఏపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement