Wednesday, November 20, 2024

జగన్‌ను ఫాలో అవుతున్న షర్మిల

ఏపీ సీఎం జగన్‌ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫాలో అవుతోంది. అన్నతో విభేదాల కారణంగా తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకున్న షర్మిల.. అన్న బాటలో నడుస్తోంది. తాజా పరిణామాలు చూస్తే ఈ విషయం సత్యమని ఎవరికైనా అర్ధం అవుతుంది. ఏపీలో గతంలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ పనిచేసింది. ఆ సమయంలో ఏపీలో పలు సమస్యలపై జగన్ దీక్షలు చేసేవారు. జలదీక్ష, ఉద్యోగ దీక్ష, పోలవరం దీక్ష.. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ లెక్కలేనన్ని దీక్షలు చేశారు. ఆ దీక్షల వల్లే వైసీపీకి ప్రజల్లో బాగా మైలేజ్ వచ్చిందని ఇప్పటికి వైసీపీ అభిమానులు భావిస్తుంటారు.

కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణలో ఇటీవల సొంత పార్టీ పెట్టిన షర్మిల తనకు మైలేజీ రావడం కోసం అన్న బాటలో నడుస్తున్నారు. గతంలో ఏ దీక్షలు అయితే తన అన్నకు ప్లస్ పాయింట్ అయ్యాయో.. ఇప్పుడు తాను కూడా అలాంటి దీక్షలు చేస్తే ప్రజలకు దగ్గర కావొచ్చు అన్న భావనతో ఆమె దీక్షలను నమ్ముకుంటున్నారు. అందుకే తెలంగాణలో ప్రతి మంగళవారం ఆమె నిరుద్యోగుల కోసం ప్రతి జిల్లాలో దీక్షలకు దిగుతున్నారు. అయితే అన్న జగన్‌కు వచ్చిన ఫాలోయింగ్ చెల్లెలు షర్మిలకు మిస్ అయ్యింది. ఆమె దీక్షలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కాబట్టి జగన్ దీక్షలను మీడియా కూడా బాగా కవర్ చేసేది. అయితే ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ, తామే అన్నట్లుగా బీజేపీ ఉండనే ఉన్నాయి. ఇక నిన్న, మొన్న పార్టీ పెట్టిన షర్మిల చేసే దీక్షలను పట్టించుకునే తీరిక ఎవ్వరికీ లేదు అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదో తూతూ మంత్రంగా ప్రతి మంగళవారం షర్మిల దీక్షలు చేస్తున్నారే తప్ప.. ఆ దీక్షలతో ఒరిగేదేమీ లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే మహిళలు సాధారణంగా శుక్రవారం ఉపవాసం చేస్తారని.. కానీ షర్మిల ప్రతి మంగళవారం దీక్షల పేరుతో ఉపవాసం చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: చీర కట్టులో పీవీ సింధు

Advertisement

తాజా వార్తలు

Advertisement