నిరుద్యోగులంటే సీఎం కేసీఆర్ కు ఎందుకు ఇంత కక్ష అని ప్రశ్నించారు వైఎష్ షర్మిల. తెలంగాణలో ఉద్యోగ నోటిషికేషన్లు లేక ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని పరామర్శించేందుకు హుజుర్ నగర్ కు నిన్న వెళ్లారు. అయితే, యువకుడి ఇంటికి తాళం వేసి ఉండడంతో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనను కలవ వద్దని టీఆర్ఎస్ నేతలు బాధిత యువకుడి కుటుంబాన్ని బెదిరించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది ప్రాణత్యాగం చేశారని, వారి కుటుంబాలను ఆదుకుంటామన్న కేసీఆర్ ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే, ఆగమేఘాల మీద మంత్రులను, నాయకులను పంపించి.. మళ్లీ ఆ సీటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పక్క పార్టీల ఎమ్మెల్యే ఎంత డబ్బులు ఇచ్చి అయినా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రతీకార రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్ధ రాజకీయాల కోసం వేగంగా పని చేసే కేసీఆర్… యువత భవిష్యత్ ను ఎందుకు దృష్టిలో పెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్ లు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. నిరుద్యోగ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేలని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగుల తరుపున తాను కొనసాగిస్తానని, అండగా ఉంటానని షర్మిల చెప్పారు. గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. 2008లో జంబో డీఎస్పీ పేరుతో ఒకేసారి 50 వేల పోస్టు భర్తీ చేశారని చెప్పారు. అంతేకాదు ప్రైవేట్ పరంగా దాదాపు 11 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. టీఆర్ఎస్ ఏడేళ్లల పాలనలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: హుజురాబాద్ లో పోటీపై పెద్దిరెడ్డి క్లారిటీ.. ఈటల చేరికపై ఆసక్తికర వ్యాఖ్యలు