Friday, November 22, 2024

సీఎం కేసీఆర్‌పై షర్మిల విమర్శల బాణాలు

మెదక్ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ తన సొంత జిల్లా అని చెప్పుకునే మెదక్ జిల్లాలో 20 కరువు మండలాలు ఉండటం దారుణమని ఆరోపించారు. ఒకప్పుడు అన్నం పెట్టే మెతుకు సీమ ఇప్పటి మెదక్ జిల్లా అని, సిద్దిపేట గొల్లభామ చీరలకు ప్రసిద్ది అన్నారు. పాటకు ప్రాణం పోసి విప్లవానికి ఊపిరి పోసిన మన గద్దర్ ఈ మెదక్ గడ్డ మీద పుట్టారని గుర్తుచేశారు. నాగేటి సాలల్లో నా తెలంగాణ అంటూ రాసిన నందిని సిద్ధారెడ్డి పుట్టిన నేల మన మెదక్ జిల్లా అని షర్మిల అన్నారు. వైఎస్ఆర్‌కు మెదక్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేదని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ జిల్లా నుంచి నలుగురిని కేబినెట్‌లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. అటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మెదక్ నుంచే ప్రారంభించారని షర్మిల తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్లు సైతం మెదక్ జిల్లా నుంచే ప్రారంభించారని.. గంజాయి సాగు చేస్తున్న వారికి ప్రత్యామ్నాయం కల్పించింది వైఎస్ఆరేనని గుర్తుచేశారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుతో 5.19 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని వైఎస్ఆర్ తలపెట్టారని..ఇప్పటి పాలకులు రీ డిజైన్ చేసి ఏం చేశారో తెలియదని ఎద్దేవా చేశారు. అటు మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులు ఇంకా ఆందోళన చేస్తున్నారని పేర్కొన్నారు. దక్షిణ భారతంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పఠాన్ చెరువులో కాలుష్యం కోరలు చాస్తుందని, ఉద్యోగం రాలేదని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దళితుల దగ్గర భూములు గుంజుకుంటున్నారన్నార‌ని ఆరోపించారు. అవుటర్ రింగ్ రోడ్డుతో మెదక్ జిల్లా రూపు రేఖలు మారిపోయాయని షర్మిల పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement