Monday, November 18, 2024

జనంలోకి జగన్.. ప్రచారంలో ఫైనల్ టచ్!

ఏపీలో తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని తిరుపతి లోక్ సభ బరిలోకి దింపింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైనల్ టచ్ ఇవ్వబోతున్నారు. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి గెలుపు కోసం ఆయన ఈ నెల 14వ తేదీన ప్రచారం చేయబోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ప్రజల్లోకి రావడం ఇదే మొదటిసారి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ జగన్ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయలేదు.

తిరుపతి లోక్‌సభ పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆశించిన మేరకు లేదని పార్టీ వర్గాల సమాచారం. గత మెజార్టీ కూడా దాటే పరిస్థితి లేదని ఇంటెలిజెన్స్‌ నివేదికలు ఇచ్చాయి. దీంతో తానే ప్రచారానికి వెళ్లాలని జగన్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు హిందూ ధర్మరక్షణకు కట్టుబడి ఉన్నానని చెప్పే ప్రయత్నంలో జగన్‌ ఉన్నట్లు సమాచారం. తిరుమలలో తాజా పరిణామాల నేపథ్యంలో ప్రచారం అవసరమని సీఎం భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే తిరుపతి పార్లమెంట్ సీట్‌ను అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలన్న టార్గెట్‌తో పని చేస్తోంది వైసీపీ. లోక్ సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ ఫైనల్ టచ్ ఇస్తే.. పార్టీకి మరింత సానుకూలత వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు మృతితో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల జరుగుతోంది. సిట్టింగ్ స్థానం కావడంతో అధికార వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రచారానికి సిద్ధమయ్యారు. ఆయన రేపు పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరుపున ప్రచారం చేయనున్నారు. కాగా, ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరుపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement