న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అందరికీ ఉద్యోగాల కల్పన నినాదంతో యువత రోడ్లెక్కారు. భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య (DYFI) ఆధ్వర్యంలో గురువారం వేలాది మంది పార్లమెంట్ మార్చ్ నిర్వహించారు. మోదీ…! నా ఉద్యోగం ఎక్కడ అనే నినాదంతో 29 రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున యువత ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాజీ ఎంపీ నిలోత్పల్ బసు వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాము, రామన్న మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఎనిమిదేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చలేదని విమర్శించారు. రెండు కోట్ల ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలకే భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమలను మూసివేసి నిరుద్యోగుల సంఖ్యను పెంచుతున్నారని, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్ట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ప్రకటనలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. యువతకు శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, చిరు వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించాలని, కొత్త పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.ఎ రహీం, హిమాఘ్నరాజ్ భట్టాచార్య, ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు