మెదక్ రూరల్ : నేటి తరం యువతకు సెల్‌ఫోన్ సంకెళ్లు వేస్తుంది. యువతలో ఆధునికత అరుదైన రుగ్మతను తెచ్చిపెట్టింది. యువతరంపై స్మార్ట్‌ఫోన్ ప్రభావం ఎక్కువగా పడుతుంది. సమాచార మార్పిడి, భావ ప్రకటన, స్వేచ్ఛ తదితర అంశాలలో సామాజిక మాధ్యమం కీలకపాత్ర పోషిస్తుంది. విజ్ఞానాన్ని పెంచడంతో పాటు అంతే అనార్ధన్ని తెచ్చిపెడుతోంది. నేటి యువత సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, స్నాప్చాట్లకు బానిసలవుతున్నారు. కొంతమంది వాటిని మోసాలు, బ్లాక్ మెయిల్ చేసేందుకు వినియోగిస్తున్నారు. ఈతరం సోషల్ మీడియాలకు బానిసలుగా మారడంపై మానసిక నిపుణుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. సామాజిక సాధనాలకు బానిస అవుతున్న యువత రోజంతా భోజనం లేకున్నా భరించగలుగుతున్నారు. కానీ ఐదు నిమిషాలు ఇంటర్నెట్ అందుబాటులో లేకుంటే అసహనానికి గురవుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఓ చేయి స్మార్ట్‌ఫోన్ పైనే ఉంటుంది. షేరింగ్ , లైక్, కామెంట్, ఈ క్షణం ఇదే ప్రపంచంగా యువత, పెద్దలు గడిపేస్తున్నారు. ఇందులో మంచికంటే చెడువైపు మొగ్గుచూపే వాటి సంఖ్య అధికంగా ఉండడమే ఆందోళన కలిగించే అంశం, రోజుకు గంట నుండి పది గంటల వరకు కాలక్షేపం చేస్తున్న వారి సంఖ్య 90శాతం వరకు ఉంది. ఈ నేపథ్యంలో యువతలో చోటుచేసుకుంటున్న సెల్ సంకెళ్లపై ఆంధ్రప్రభ అందిస్తున్న ప్రత్యేక కథనం..
రోజంతా వీడియో గేమ్లతోనే..:
కొందరు సామాజిక మాధ్యమాల్లో ముందుకెళ్తుంటే మరికొందరు వీడియో గేమ్స్‌తో కాలం గడిపేస్తున్నారు. వీడియో గేమ్‌లో నిమగ్నమయితే పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలియనంతగా లీనమైపోతున్నారు. ఆటల్లో మునిగి ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు.
అధికమవుతున్న నెట్ వినియోగం..:
గతంలో నెట్ దొరకాలంటే కనానా అవస్థలు పడేవారు.. ప్రస్తుతం త్రీ జీ ఫోర్జీ, ఫైజీ సేవలతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ డెటా ప్యాకెజీలు దొరకడంతో నెట్ వినియోగం పెరిగిపోతుంది. యువత చాటింగ్ , వీడియో కాలింగ్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. వాట్సాఫ్, ఫేస్బుక్, ట్విట్టర్ నుండి మరికొన్ని సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అవి ఇవి అని లేకుండా యువత తమకు నచ్చినట్లు షేర్ చేసుకుంటున్నారు.
ఇంట్లో కనబడని సందడి.. :
ఉమ్మడి కుంటుంబం భారతీయుల ప్రత్యేకం. ఒకప్పుడు రాత్రి భోజనాలు అయ్యాక అంతా ఓ చోట కూర్చొని కబుర్లు చెబుకునేవారు. ఇంట్లో నలుగురు ఉన్నా ఇళ్లంతా సందడిగా కనిపించేంది. ఇప్పుడు నలుగురు ఉన్న చోట కూడా మౌనం రాజ్యమేలుతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఎవరి లోకంలో వారు తెలియాడుతున్నారు. యువతకు లైక్‌లు, కామెంట్లు, టిక్ట్యాక్ లే జీవితంగా మారిపోయింది.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.:
పెిల్లలు నిత్యం, ల్యాబ్ట్యాబ్లు, సెల్ఫోన్లతో గడుపుతున్నారు. ఆ సమయంలో ఇబ్బంది కలిగిస్తే కోపంతో ఊగిపోతారు. చదువును సైతం నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులను కూడా ఎదిరిస్తారు. చాలా మంది విజ్ఞానం కోసం వినియోగించకుండా కొత్తపరిచయాలు, కొత్త స్నేహం కోసం వెతుకుతుంటారు. ఇలాంటి వారిపట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ మంది అర్దరాత్రి వరకు చదువు కంటే చాటింగ్‌కే ప్రాధాన్యమిస్తున్నారు. తమ పిల్లలు గదిలో అర్దరాత్రి వరకు లైట్ వెలుగుతుంటే బిడ్డ చదువుకుంటున్నారని తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. ఫలితాలు చూస్తే ఆలా ఉండవు. వస్తువులు కొనివ్వడంతోనే తమ పనైపోయిందని భావిస్తున్న తల్లిదండ్రులు వాటిని వారు ఎందుకు ఉపయోగిస్తున్నారని పట్టించుకోవడం లేదు. మనకు తెలియకుండానే మన పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు.
బయటపడేందుకు ఏం చేయాలి..:
ఫోన్‌ను ఏ సందర్భంలో ఎక్కువ సేపు వాడుతున్నామనే విషయాన్ని చెక్‌చేసుకోవడం, సామాజిక మాధ్యమాల యాప్స్ ను ఫోన్ నుంచి డీ ఇన్స్టాల్ చేయడం రోజులో కొంతసమయమైనా ఫోన్‌ను స్విచ్ఆఫ్ చేసి ఉంచడం, మనుషులతో ముఖాముఖి మాట్లాడడానికి చాటింగ్‌లో మాట్లాడడానికి గల వ్యత్యాసాన్ని గుర్తించడం, పడుకునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, వాష్‌రూమ్‌లో ఫోన్ వాడకుండా ఉండడం. ప్రెండ్స్‌తో కాలక్షేపం చేయడం, ఆటలు ఆడడం వల్ల కొంతైనా సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంటాం.