Friday, November 22, 2024

Delhi | మీ తిట్లే మాకు ఆశీర్వాదాలు.. బీఆర్ఎస్ సభపై కిషన్ రెడ్డి కౌంటర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలోని ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్వహించిన సభ కేవలం బీజేపీని, ప్రధాని మోదీని తిట్టడానికే పెట్టినట్టుగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం బీఆర్ఎస్ సభ ముగిసిన వెంటనే ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాల తిట్లే ఆశీర్వాదంగా బీజేపీ బలోపేతమవుతోందని వెల్లడించారు. బీజేపీని ఎంత తిడితే తెలంగాణ ప్రజలు అంత దగ్గరవుతారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంగా ఖమ్మం సభలో కేసీఆర్ సహా హాజరైన నేతల ప్రసంగాలు కొండను తవ్వి తొండను పట్టినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

తొమ్మిదేళ్లు ప్రజలను కలవకుండా ఫాంహౌజ్‌కే పరిమితమైన కేసీఆర్ ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా అహర్నిశలు దేశం కోసం కృషి చేస్తున్న ప్రధాని మోదీ గురించి మాట్లాడ్డం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని అన్నారు. కేసీఆర్ తానొక ముఖ్యమంత్రి అన్న విషయం మరచి దేశంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయం కోసం బీజేపీని విమర్శిస్తే తప్పేమీ లేదని, కానీ దేశాన్ని కించపరిచేలా, తక్కువ చేసి చూపేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుల స్థైర్యం దెబ్బతినేలా, వారిని కించపరిచేలా మాట్లాడారని గుర్తుచేస్తూ దేశాన్ని పాకిస్తాన్‌తో, అఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో పోల్చడాన్ని దేశ ప్రజలు సహించరని కిషన్ రెడ్డి అన్నారు.

మేకిన్ ఇండియా – జోక్ ఇన్ ఇండియా’ అంటూ ఎద్దేవా చేస్తున్న కేసీఆర్. 2014తో పోల్చితే దేశంలో తయారీ రంగం ఎన్ని రెట్లు పెరిగిందో చూడాలని గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో ప్రపంచమంతటా ఉత్పాదకత నిలిచిపోగా భారత్ వృద్ధి పథంలో దూసుకెళ్లిందని అన్నారు. దేశంలో ఎక్కడా విద్యుత్ కొరత అన్నదే లేకుండా చేయడంలో కేంద్ర ప్రభుత్వానికే ముఖ్య పాత్ర అని తెలిపారు. 2014లో రక్షణ రంగ ఎగుమతులు రూ. 900 కోట్లు ఉంటే అవి ఇప్పుడు రూ. 15 వేల కోట్లకు పెరిగాయని, 75 దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

వందే భారత్ రైళ్లు, రైల్వేల్లో రక్షణ వ్యవస్థకోసం దేశీయ సాంకేతికతతో రూపొందించిన ‘కవచ్ సిస్టమ్’, హెచ్ఏఎల్ ఆధ్వర్యంలో హెలికాప్టర్లు వంటివెన్నో మెకిన్ ఇండియాలో వచ్చినవేనన్నారు. ప్రపంచస్థాయి సదుపాయాలతో దేశీయంగా ‘వందే భారత్’ రైళ్లను తయారు చేసి 100 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా వెళ్తుంటే మేకిన్ ఇండియాపై జోకులు వేయడం కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తికి మేకిన్ ఇండియా ఏం కనబడుతుందిలే అంటూ ఎద్దేవా చేశారు.

అధికార దాహం తప్ప వేరే లక్ష్యంలేని కల్వకుంట్ల కుటుంబం.. దేశం లక్ష్యాన్ని కోల్పోయిందని విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. 9 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంతరాత్మ మళ్లీ అధికారం ఎలా పొందాలనేదే తప్ప దేశం, సమాజం కోసం ఎంతమాత్రం కాదని ఆయన అన్నారు. కరోనా సమయంలో ఎన్-95 మాస్కుల దగ్గర్నుంచి పీపీఈ కిట్లు, ఆక్సీజన్ ప్లాంట్లు, ఆక్సీజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు.. చివరకు వాక్సిన్ కూడా మేకిన్ ఇండియాలో దేశీయంగా తయారుచేసుకున్నవేనని గుర్తుచేశారు.

ఇతరదేశాలనుంచి పామాయిల్ దిగుమతులను తగ్గించుకునేందుకే దేశీయంగా పామాయిల్ ఉత్పత్తిని పెంచేలా కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా.. దీనిపై కూడా టీఆర్ఎస్ నాయకులు అనవసర రాజకీయాలు చేస్తున్నారన్నారు. దేశం ప్రజల్లో అన్ని విషయాల్లో స్పష్టత ఉందని.. కేసీఆర్ కుటుంబమే కన్‌ఫ్యూజన్‌లో ఉండి దీన్ని ప్రజలపైకి నెట్టడం సరికాదన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలోనూ ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రాడక్ట్’ను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం పథకాలను, ప్రోత్సాహకాలు తీసుకొచ్చిందన్నారు.

సమావేశాలకు డుమ్మా కొట్టిందెవరు?.. జలవివాదాలు పరిష్కారం కాకుండా చేస్తున్నదెవరు?
జల వివాదాలను కేంద్రం పరిష్కరించడం లేదంటూ కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమని, కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు సమావేశానికి పిలిస్తే.. వాటికి రాకుండా డుమ్మాలు కొట్టి నింద కేంద్రం పైకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. సమావేశాలకు హాజరవడానికి సమయం దొరకని కేసీఆర్ కు.. ఏపీ ముఖ్యమంత్రితో కలిసి విందుభోజనాలు చేయడానికి మాత్రం సమయం ఉంటుందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అసెట్ మానిటైజేషన్ కు ప్రైవేటైజేషన్ కు తేడా ఉందని, భారీగా నష్టాల్లో ఉన్న కంపెనీల భారాన్ని పన్ను చెల్లింపుదారుల మీద పడకుండా ప్రైవేటైజేషన్ జరిగిందన్నారు. ఏడాదికి దాదాపు 800 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్న ఎయిర్ ఇండియా భారాన్ని ప్రజలపై మోపడం ఇష్టం లేక.. ఎక్కడినుంచి తీసుకున్నామో తిరిగి ఆ సంస్థకే అప్పగించామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యలు ఏమాత్రం తగ్గలేదనే విషయాన్ని ఎన్సీఆర్బీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని కిషన్ రె డ్డి పేర్కొన్నారు. ఖమ్మం సమావేశంలో మాట్లాడిన వక్తలు బీఆర్ఎస్ శబ్దాన్ని కూడా ఉచ్ఛరించేందుకు ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటూ అర్థరహితమైన విమర్శలు చేస్తున్న కేసీఆర్.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉన్న విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కనీసం ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని నెట్టేశారన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా తమ డబ్బులు రాక ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. హాస్టళ్లలో విద్యార్థులు పురుగులు పడ్డ భోజనం చేయడం ఇష్టంలేక రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారన్నారు. తన మనవడు తినే భోజనమే హాస్టళ్లలో పెట్టాలని చెప్పిన కేసీఆర్, ఒకసారి తన మనవడిని హాస్టల్‌కు పంపితే అసలు విషయం తెలుస్తుందని సూచించారు.

బీఆర్ఎస్ ను గెలిపిస్తే రెండేళ్లో వెలుగు జిలుగులు తీసుకొస్తానని కేసీఆర్ చెప్పడం చూస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని, రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి భూ మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియాగా మార్చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. 9 ఏళ్లుగా కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ నిధులతోనే కాస్తో, కూస్తో పంచాయతీల్లో అభివృద్ధి జరిగిందని.. అంతకు మించి రాష్ట్రం నిధుల కేటాయింపు జరగని కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్లుందన్నారు. కేంద్రం నిధులను పంచాయతీల ఖాతాల్లో వేస్తే దొంగ డిజిటల్ కీలతో వాటిని కాజేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కలల్లో మిగిలిపోయే పార్టీయేనని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలు కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం తీరుపట్ల విసిగివేసారి పోయారని, వచ్చే ఎన్నికల్లో ఓడించి ఆ కుటుంబాన్ని ఫాంహౌజ్ కు పరిమితం చేయడం ఖాయమని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఎన్ని తిట్లు తిడితే బీజేపీకి అవన్నీ ఆశీర్వాదాలుగా మారుతున్నాయని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement