Thursday, November 21, 2024

యువ టీమిండియా, గెలుపు జోరు కొనసాగేనా.. నేడు శ్రీలంకతో తొలి టీ20

వెస్టిండీస్‌తో సొంత గడ్డపై ఆడిన భారత్‌.. టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక ఇదే ఊపును శ్రీలంకపై కూడా కొనసాగించాలని భావిస్తున్నది. నేడు లక్నోలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మైదానం వేదికగా లంకేయులతో తొలి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. అయితే టీమిండియాలోని యువ ఆటగాళ్లపై అందరి చూపు ఉంది. అందులోనూ.. వెంకటేష్‌ అయ్యర్‌తో పాటు రవి బిష్ణోయ్‌పై క్రికెట్‌ అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. శ్రీలంక జట్టును కూడా క్లీన్‌ స్వీప్‌ చేయాలనే కసితో యువ ఆటగాళ్లు ఉన్నారు. శ్రీలంకతో టీమిండియా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడుతుంది. విరాట్‌ కోహ్లీ, రిషబ్‌ పంత్‌తో పాటు శార్దూల్‌ ఠాకూర్‌కు విశ్రాంతి ఇచ్చారు. వీరి స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు. దీంతో మొత్తం టీమిండియా జట్టులో కుర్రాళ్లు ఉన్నారు. వీరు వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో విఫలం అయ్యారు. శ్రీలంక జట్టుపై మంచి ప్రతిభ కనబరుస్తారని భావిస్తున్నారు.

సంజు శాంసన్‌కు చోటు..

సంజు శాంసన్‌కు కూడా జట్టులోకి 11వ ఆటగాడిగా చోటు కల్పించారు. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచులో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఇదే ఊపును శ్రీలంకపై కూడా కొనసాగిస్తాడో లేదో చూడాల్సి ఉంది. జస్ప్రిత్‌ బుమ్రాను కూడా జట్టులోకి తీసుకున్నారు. దీంతో భారత్‌ బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టంగా మారింది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో ఫాస్ట్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మంచి ప్రతిభ కనబర్చాడు. దీంతో అతనికీ శ్రీలంక సిరీస్‌లో చోటు లభించింది. యువ ఆల్‌ రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ కూడా వెస్టిండీస్‌పై ఎంతో బాగా రాణించాడు. మ్యాచ్‌ ఫినిషింగ్‌ యాజమాన్యాన్ని ఎంతో ఆకట్టుకుంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించాడు. వరల్డ్‌ క్లాస్‌ ఆల్‌ రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

ప్రాక్టీస్‌కు దూరంగా సూర్య కుమార్‌..

ఇక శ్రీలంక విషయానికొస్తే.. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో పోగొట్టుకుంది. భారత్‌పై తమ బ్యాటర్లు రాణిస్తే.. సునాయాసంగా విజయం సాధిస్తామని కెప్టెన్‌ దాసన్‌ శనకా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇరు జట్లకు షాక్‌లు తగిలాయి. భారత్‌ జట్టును గాయాల బెడద వేధిస్తున్నది. ఇప్పటికే గాయాలతో శ్రీలంక సిరీస్‌కు లోకేష్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌ దూరం కాగా.. తాజాగా ఈ జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా చేరాడు. మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌ స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైనప్పుడు రాణించి టీమిండియాను ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు. విండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ.. సూర్యకుమార్‌ గాయపడినట్టు తెలుస్తున్నది. కుడి చేతి వేళ్లకు గాయమైంది. ప్రాక్టీస్‌ సెషన్‌లో కూడా యాదవ్‌ పాల్గొనలేదు. దీంతో శ్రీలంక టీ20 సిరీస్‌ నుంచి యాదవ్‌ తప్పుకుంటున్నట్టు బీసీసీఐ అధికారి వెల్లడించారు. 24, 26, 27వ తేదీల్లో టీ20 సిరీస్‌ జరగనుంది. బెంగళూరు వేదికగా మార్చి 4-8 వరకు తొలి టెస్టు, మార్చి 12-16 వరకు రెండో టెస్టు ఆడుతారు.

- Advertisement -

హసరంగకు కరోనా పాజిటివ్‌..

టీమిండియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు శ్రీలంక స్టార్‌ ఆల్‌ రౌండర్‌ వనిందు హసరంగ దూరం అయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కరోనా బారినపడిన హసరంగా.. ఇంకా కోలుకోలేదు. తాజాగా నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులో హసరంగకు మరోసారి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో అతను భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. టెస్టు సిరీస్‌లోనూ హసరంగ ఆడటం అనుమానంగానే ఉంది. ఆసీస్‌ పర్యటనలో కుశాల్‌ మెండిస్‌, బినుర ఫెర్నాండో, వనిందు హసరంగలు కరోనా బారినపడ్డారు. దీంతో వారు ముగ్గురు సిరీస్‌లోని మిగిలిన మూడు టీ20 మ్యాచులకు దూరం అయ్యారు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో హసరంగను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు.. రూ.10.75 కోట్లు చెల్లించి దక్కించుకుంది.

భారత్‌ టీ20 జట్టు : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ హుడా, రవీంద్ర జడేజా, చాహల్‌, రవి బిష్ణోయ్‌, కుల్దిdప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అవేశ్‌ ఖాన్‌.

శ్రీలంక జట్టు : దాసున్‌ పనక, పాతుమ్‌ నిస్సంక, కుశాల్‌ మెండిస్‌, చరిత్‌ అసలంక, దినేష్‌ చండిమాల్‌, దనుష్క గుణతిలక, కమిల్‌ మిషారా, జనిత్‌ లియానగే, చామికా కరుణ రత్నే, దుష్మంత చమీర, లహిరు కుమార, బినూర ఫెర్నాండో, మహేశ్‌ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్‌ జయవిక్రమ, ఆషియాన్‌ డేనియల్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement