హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రజలకు పట్టింపు లేనంతకాలం వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా లాభం లేదని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. విశ్రాంత డీజీపీ పద్మశ్రీ ప్రకాశ్ సింగ్ రాసిన ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా అనే పుస్తకంపై ఉస్మానియా యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చట్టాలున్నా.. ప్రజలకు అవగాహన ఉన్నా.. 40 ఏళ్లుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయని.. చట్ట సభల సభ్యుల పదవీకాలం ముగిసే వరకు ఒక్క కేసూ రుజువు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం, ప్రాంతం వైషమ్యాలు వదిలి యువత స్పందించినపుడే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. సమాజంలో ఏమి జరిగినా ప్రజలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. సీబీఐ లాంటి సంస్థలకు చట్టబద్ధత లేదని పాట్నా హైకోర్టు తీర్పు చెప్పిందన్న చలమేశ్వర్ పదేళ్లుగా ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. అంతిమంగా ఎలాంటి సమాజాన్ని నిర్మించుకోవాలన్న అందుకు ప్రజలు ముఖ్యంగా యువతే నిర్మాతలని వివరించారు. ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే పోలీసు సంస్కరణలు అని వార్యమని పుస్తక రచయిత, విశ్రాంత డీజీపీ ప్రకాశ్ సింగ్ అన్నారు.
దేశంలో అవినీతి, అంతర్గత సమస్యల వల్ల ఏటా ఐదు శాతం జీడీపీ కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పాతికేళ్లుగా పోలీస్ విభాగాల్లో సంస్కరణల కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. రాజకీయ నాయకులు పోలీసు నుంచి ప్రజల పోలీసుగా మారనంత కాలం వ్యవస్థలో చెప్పుకోదగ్గ మార్పు రాదన్నారు. పోలీసు సంస్కరణల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారే తప్ప.. ఏ ఒక్కరూ హృదయపూర్వకంగా సహకరించలేదని వివరించారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ సంస్కరణలను కేవలం కాగితాలపైనే చూపుతున్నారని అన్నారు. ప్రజలకు పోలీసులు జవాబుదారీగా ఉండాలన్న ఆయన ప్రజలకు ప్రతి విషయంపట్ల అవగాహన ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారన్నారు. న్యాయ వ్యవస్థ కొన్ని ప్రభుత్వాల చొరవవల్ల కాస్త ముందుకు సాగినా.. సంస్కరణలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఆధునిక భారత నిర్మాణానికి పోలీసు సంస్కరణలు అవసరమని సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రకాశ్‌సింగ్ రాసిన ఈ పుస్తకం భవిష్యత్తు తరాలకు ఓ పరిశోధన గ్రంధం కాగలదన్నారు. 1996 నుంచి మొదలు నేటి వరకు ప్రకాశ్ సింగ్ పోలీసు సంస్కరణల కోసం ప్రయత్నిస్తూ ఉన్నా.. సాకారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకం పేరు ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రీఫార్మ్స్ బదులుగా.. ప్రొట్రాక్టెడ్ స్ట్రగుల్ అని ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. తీవ్రవాద, ఉగ్రవాదం సహా ఎన్నో సమస్యలకు అదనంగా సైబర్ క్రైమ్ కోరలు చాస్తోందన్న ఆయన పోలీసు సంస్కరణల కోసం ఇక ప్రజలే నినదించాలని పిలుపునిచ్చారు.
43 శాతం ఎంపీలు, 30 శాతం ఎమ్మెల్యేలు నేర చరిత్ర కలిగిన వారు ప్రజలకు నేతృత్వం వహిస్తున్నారని అనేక కమిటీల్లో సభ్యుడిగా ఉన్న మజీర్ హుస్సేన్ అన్నారు. ఒక్క జార్ఖండ్ రాష్ట్రంలోనే 74 శాతం ఎమ్మెల్యేలకు నేరచరిత్ర ఉందని గుర్తు చేశారు. పోలీసులను కేవలం పావుగా వాడుకుంటున్నారే తప్ప వారికి పూర్తి స్థాయి స్వేచ్చ లేదని చెప్పారు. పోలీసు వ్యవస్థను రాజకీయ వ్యవస్థ దుర్వినియోగం చేస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రేటర్డ్ డీజీ కమల్ కుమార్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.