ఈ ఆర్ధిక సంవత్సరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని ఆర్ధిక శాఖ హెచ్చరించింది. నెలవారి సమీక్షలో భాగంగా మంగళవారం నాడు ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఈ అభిప్రాయపం వ్యక్తం చేసింది. దేశంలో వ్యవసాయ ఉత్పత్తి తగ్గుతుందని అంచనా వేశారని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, ఆర్ధిక మాంద్యం భయాలు ఉన్నాయని ఈ పరిస్థితుల మూలంగా మన దేశం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది. ద్రవ్యోల్బణం, ఆర్ధిక వృద్ధి విషయంలో సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, భౌగోళిక పరిస్థితులు ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో ఎలర్ట్ గా ఉండాలని తెలిపింది.
ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) మన ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు 6.5 శాతం వరకు ఉంటుందని అంచనా వేసినట్లు పేర్కొంది. ప్రధానంగా ఎలినినో పరిస్థితుల మూలంగా వర్షాలు తక్కువ పడే అవకాశం ఉందని, దీని వల్ల కరుపు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. ఉత్పత్తి తగ్గిపోతుంది, ధరలు పెరగడంతో పాటు భౌగోళిక, రాజకీయ పరిణామాలు, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అస్థిరత వంటి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని ఆర్ధిక సమీక్ష పేర్కొంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో భారత ఆర్ధిక వ్యవస్థ బలంగానే ఉందన్నారు.
కరోనా నుంచి కోలుకోవడం, భౌగోళిక రాజకీయ ప్రతికూల అంశాలు, గ్లోబల్ ఆర్ధిక వ్యవస్థల మందగమనం వంటి సవాళ్లు ఎదురైన్పటికీ మన దేశ ఆర్ధిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉందని సమీక్ష పేర్కొంది. ప్రపంచంలో ప్రధాన ఆర్ధిక వ్యవస్థలు బలహీనంగా ఉన్నప్పటికీ మన ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు 7 శాతంగా ఉండటం మన బలాన్ని సూచిస్తుందని పేర్కొంది. సూక్ష్మ ఆర్ధిక వ్యవస్థ పనితీరు మెరుగ్గాఉండటంతో కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం, ద్రవ్యోల్బణ ఒత్తిడి క్రమంగా తగ్గిపోతున్నదని పేర్కొంది.
బలంగా బ్యాంకింగ్ వ్యవస్థ…
ద్రవ్యోల్బణ నియంత్రణ కోసం వడ్డీ రేట్లు పెంచినప్పటికీ మన బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉందని తెలపింది. ఆర్ధిక రంగంలో ఆర్బీఐ పర్యవేక్షణలో బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలిపింది. బ్యాంక్‌ల ఆస్తుల పరిమాణంతో సంబంధం లేకుండా ఆర్ధిక స్థిరత్వంపై ద్వై వార్షిక అంచనాలతో పటిష్టంగా ఉందని పేర్కొంది. స్థూల ఒత్తిడి పరీక్షలు కూడా వ్యక్తిగత బ్యాంక్‌ల్లో ఎప్పటికప్పుడు నిర్వహిస్తారు. హోల్ట్ టూ మెచ్యూరిటీ సెక్యూరిటీలలో పెట్టుబడి 23 శాతం డిపాజిట్లకు పరిమితం చేశారు. ఇది ప్రతికూల మార్కెట్ పరిణామాల నుంచి ఆస్తి విలువను సమర్ధవంతంగా నిరోధించడాన్ని ప్రతిబింబిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు 63 శాతం వరకు నిర్ణయిత కాలపరిమితితోఉన్నందున వీటిని వేగంగా ఉపసంహరించుకోవడం కుదరదు.
ఇలాంటి చర్యల మూలంగా అమెరికా, ఐరోపా బ్యాంక్‌ల మాదిరిగా సంక్షోభంలో పడే అవకాశం లేదని ఆర్ధిక సమీక్ష స్పష్టం చేసింది. అమెరికా, ఐరోపా దేశాల్లో వడ్డీరేట్లు పెంచడంతో అక్కడ అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ), ఐరోపాలో క్రెడిట్ సూజ్ బ్యాంక్‌లు పతనం అయ్యాయి. అక్కడి బ్యాంక్‌లు ఎక్కువగా బాండ్లపై ఆధారపడంతో వడ్డీ రేట్లు పెరిగి, ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. మన దగ్గర బ్యాంక్‌ల్లో ఎక్కువ భాగం ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రుణాలు ఉన్నాయి. ఈవి రెండు బ్యాంక్‌లకు పెద్దగా ఇబ్బంది కలిగించే అంశాలు కానందున మన బ్యాంక్‌లు పటిష్టంగా ఉన్నాయని సమీక్ష తెలిపింది.
తగ్గిన ద్రవ్యోల్బణం…
2023 మార్చిలో వినియోగదారుల ధరల సూచీ 2022 జూన్ తరువాత మొదటిసారిగా చాలా తక్కువ నమోదైందని పేర్కొంది. ధరలు తగ్గడంతో హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా తగ్గిందని పేర్కొంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 6.7 శాతం నుంచి 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 5.5 శాతానికి తగ్గింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆర్భీఐ వడ్డీ రేట్లను పెంచడం వంటి చర్యల మూలంగా ద్రవ్యోల్బణం చాలా వరకు నియంత్రణలోకి వచ్చందని ఆర్ధిక సమీక్ష తెలిపింది. కరెంట్ అకౌంట్ లోటు క్రమంగా తగ్గుతూ వస్తోందని తెలిపింది. విదేవీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ)లు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెంచడంతో మూడో త్రైమాసికంలో విదేశీ మారక నిల్వలు పెరిగినట్లు తెలిపింది. 4వ త్రైమాసికంలో విదేశీ మారక నిల్వల పరిస్థితి మరింత మెరుగుపడిందని తెలిపింది.