Tuesday, November 26, 2024

మీరు మాఫీవీర్‌, ప్రధాని మోడీపై రాహుల్‌ విసుర్లు.. అగ్నిపథ్‌ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌

ఎనిమిదేళ్లుగా ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ ప్రజాందోళనల నేపథ్యంలో నిర్ణయాలను వెనక్కు తీసుకోక తప్పదని, మాఫీవీర్‌గా ప్రజల్లో మిగిలిపోతారని కాంగ్రెస్‌ నేత ఎద్దేవా చేశారు. త్రివిధ దళాల్లో చేరాలనుకుంటున్న అభ్యర్థుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని అగ్నిపథ్‌ పథకాన్ని వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. గతంలో రైతుల ఆందోళనల కారణంగా వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న విధంగానే అగ్నిపథ్‌ను రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కోరారు. జై జవాన్‌ – జై కిసాన్‌ స్ఫూర్తిని మోడీ ప్రభుత్వం అవమానించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి యువతకు భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ర్మీ ఉద్యోగార్థుల బాధ తెలుసుకోండి – ప్రియాంకగాంధీ

త్రివిధ దళాల్లో చేరేందుకు యువత పరితపిస్తోందని, అలాంటివారి ఆశలకు విరుద్ధంగా అకస్మాత్తుగా అగ్నిపథ్‌ను ప్రకటించి ఆందోళనకు గురి చేశారని కాంగ్రెస్‌ యూపీ ఇన్‌ఛార్జ్‌ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉద్యోగార్థుల బాధ ఏమితో తెలుసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. మోడీ ప్రభుత్వంపై తల్లి సోనియా, సోదరుడు రాహుల్‌ గాంధీ విమర్శల గుప్పించిన నేపథ్యంలో ప్రియాంక కూడా నిరసన గళం విప్పారు. మూడేళ్లుగా రక్షణ బలగాల్లో నియామకాలేవీ జరగలేదని, వారంతా నిరాశానిస్పృహల్లో ఉన్నారని, వైమానిక దళ నియామక ఫలితాలకోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. గతంలో సైనిక నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ముందుకు తీసుకువెళ్లాలని, ఆ పరీక్షల కోసం అభ్యర్థులు పడిన శ్రమను పరిగణనలోకి తీసుకోవాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌కు రాసిన లేఖను ఈ ప్రకటనతో జతపరిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement