Monday, November 25, 2024

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు, పారదర్శకతను నిరూపించుకోవాలి : ఎంపీ అరవింద్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి కొడుకుగా, రాష్ట్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కే. తారక రామారావు (కేటీఆర్) తనపై తరచుగా వస్తున్న డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో స్వచ్ఛందంగా టెస్టు చేయించుకుని ‘క్లీన్‌’గా బయటకు రావాలని బీజేపీ ఎంపీ (నిజామాబాద్) ధర్మపురి అరవింద్ అన్నారు. డ్రగ్స్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌పై స్పందిస్తూ ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మంగళవారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ఒకసారి కేటీఆరే స్వయంగా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారని, ఆ మాటపై నిలబడి టెస్టులు చేయించుకుని పారదర్శకత చాటుకోవాలని హితవు పలికారు. అంతే తప్ప కేటీఆర్ అవయవాలు, చర్మం, వెంట్రుకలు ఎవరికీ అవసరం లేదని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ తంబాకు నములుతాడంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలను అరవింద్ తప్పుబట్టారు. లవంగాకు, తంబాకుకు తేడా తెలియని మనిషి కేటీఆర్ అని మండిపడ్డారు.

బండి సంజయ్‌కు సవాల్ చేసే ముందు బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు అమలు చేశారో చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో 100 రోజుల ప్రణాళిక అన్నారని, నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ఉచిత కరెంట్, వరద బాధితులకు రూ. 10వేలు పరిహారం అన్నారని, కానీ ఏదీ అమలు కాలేదని విమర్శించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉచిత ఎరువులు వంటి ఎన్నో వాగ్దానాలు గాలికొదిలేశారని దుయ్యబట్టారు. దళిత బంధు ఏమైందో ముందు చెప్పాలని అన్నారు.

80కి పైగా గెలుస్తాం

- Advertisement -

మరోవైపు ప్రధాన మంత్రితో జరిగిన భేటీ గురించి మాట్లాడుతూ రాజకీయ, పాలనాపరమైన అంశాల గురించి చర్చించినట్టు వెల్లడించారు. అయితే చర్చించిన అన్ని విషయాల గురించి తాను మీడియాకు చెప్పలేనని అన్నారు. తమ నాయకుల పాపులారిటీ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 80 సీట్ల కంటే ఎక్కువ గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దోషిగా తేలితే జైలుకు పోతారు

మంత్రి కేటీ రామారావు, ఎమ్మెల్సీ కవిత కేసుల్లో దోషులుగా తేలితే జైలుకు వెళ్తారని ధర్మపురి అరవింద్ అన్నారు. అయితే ఈ కేసులకు, దర్యాప్తు సంస్థలు ఇచ్చే నోటీసులకు, బీజేపీకి సంబంధం అంటగడుతూ మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. దర్యాప్తు సంస్థలు, కోర్టులు తమ పని తాము చేసుకుంటూ పోతాయని, ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేసుకుంటుందని అన్నారు. వాటి విషయంలో పార్టీ వేలు పెట్టడం కుదరదని తెలిపారు. ఆ కేసులకు, బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం కేసులో కవిత దోషిగా తేలుతుందని, ఆమెకు జైలుకు వెళ్తుందని అన్నారు. ఫీనిక్స్ కేసులో కేటీఆర్ దోషిగా తేలితే ఆయన కూడా జైలుకు వెళ్తారని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement