Friday, November 22, 2024

మీరు హీరోలు!.. దేశం కోసం తెగించి పోరాడారు : పుతిన్‌..

మాస్కో:ఉక్రెయిన్‌పై దండయాత్రలో గాయపడిన సైనికులను హీరోలుగా అభివర్ణిస్తూ దేశాధ్యక్షుడు పుతిన్‌ ప్రశంసలు కురిపించారు. యుద్ధం ప్రారంభమైన 92 రోజుల తరువాత తొలిసారిగా ఆయన సైనికులను పరామర్శించారు. రాజధాని మాస్కోలోని మాట్రికా సైనిక ఆస్పత్రిని బుధవారం ఉదయం రక్షణమంత్రి సెర్జీతో కలసి పుతిన్‌ సందర్శించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం సందర్భంగా గాయపడి చికిత్స పొందుతున్న ఇద్దరు సైనికులను పలకరించారు. వారితో కరచాలనం చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తెల్లటి కోటు ధరించి వచ్చిన పుతిన్‌ ఆస్పత్రి దుస్తులు, రష్యన్‌ లోగోతో ఉన్న కోటు ధరించిన సైనికులతో కొద్దిసేపు మాట్లాడారు. వారు ఏ ప్రాంతానికి చెందినవారో అడిగి తెలుసుకున్నారు. ఒక సైనికుడితో మాట్లాడుతూ మీ చిన్నారి కుమారుడు ఎలా ఉన్నాడంటూ అడిగారు. యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి ఇంకా కుటుంబ సభ్యులను, తన కుమారుడిని చూడలేదనడంతో.. మన భవిష్యత్‌ అంతా బాగుంటుంది.. అధైర్యం వద్దంటూ భరోసా ఇచ్చారు. మీరు దేశం కోసం, ఉక్రెయిన్‌లో స్వేచ్ఛకోరుకుంటున్న ప్రజల కోసం ప్రాణాలకు తెగించి చేస్తున్న మిమ్మల్ని చూసి పిల్లలు గర్వపడతారని ప్రశంసించారు. కొద్దిసేపు వారితో కలసి అటూ ఇటూ తిరిగారు. వైద్యులు, రక్షణ మంత్రి సెర్జీ పుతిన్‌ వెంట ఉన్నారు. కాగా ఇదంతా డ్రామా అని, మాస్కోవా మునక, ఉక్రెయిన్‌ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోతే స్పందించని పుతిన్‌ ఇప్పుడు ఆస్పత్రికి వచ్చి పరామర్శించడం ఓ ప్రచారార్భాటమని విమర్శలు వెల్లువెత్తాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బయటకు రావడమే లేదని, అధికారులతో సమావేశంవంటివన్నీ ముందే రికార్డు చేసిన దృశ్యాలని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు సైనికులను పరామర్శించేందుకు పుతిన్‌ స్వయంగా రావడం ఆసక్తి రేపింది. ఇదిలా ఉండగా రష్యా దండయాత్ర ప్రారంభమైన నాలుగైదు రోజులకే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీధుల్లోకి వచ్చి సైనికులతో మాట్లాడారు. గాయపడినవారిని, మృతుల కుటుంబాలను పరామర్శించారు. పుతిన్‌ మాత్రం యుద్ధం ప్రారంభమైన 3 నెలల తరువాత సైనికులతో మాట్లాడారు.

పెన్షన్లు, కనీస వేతనం పెంపు..

ఇదిలా ఉండగా ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతున్న ప్రజలకు ఊరట కల్పించేలా పుతిన్‌ కీలక ప్రకటన చేశారు. దేశంలో సగటు కనీస వేతనాన్ని, పెన్షన్లను పదిశాతం మేర పెంచుతూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ద్రవ్యోల్బణం18 శాతానికి చేరి ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నట్లు క్రెవ్లిున్‌ ప్రకటించింది. దేశం ఈ ఏడాది ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదన్న ఆయన ఉక్రెయిన్‌ యుద్ధం పరిణామాల ఈ పరిస్థితికి కారణం కాదన్నారు. ఉన్నతాధికారులతో ఆయన సమీక్షిస్తూ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను ప్రభుత్వం విడుదల చేసింది. జూన్‌ 1వ తేదీనుంచి పెన్షన్ల పెంపు, జూలై 1వ తేదీ నుంచి కనీస వేతనాల పెంపు అమల్లోకి వస్తుందని క్రెవ్లిున్‌ ప్రకటించింది. ప్రస్తుతం రష్యాలో కనీస వేతనం నెలకు 13,890 రూబుల్స్‌, సగటు పెన్షన్‌ 18,521 రూబుల్స్‌గా ఉంది. ఈ పెంపువల్ల ప్రభుత్వంపై ఏడాదికి 600 బిలియన్‌ రూబుల్స్‌ (10.5 బిలియన్‌ డాలర్లు) భారం పడుతుందని ఆర్థికమంత్రి అంటోన్‌ సిల్యునోవ్‌ తెలిపారు. ఉక్రెయిన్‌ పై యద్ధం, ఆర్థిక కష్టాల నేపథ్యంలో పుతిన్‌పై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. వారి కోపాన్ని తగ్గించి ఆదరణ పెంచుకునేందుకు పుతిన్‌ ఈ చర్యలు తీసుకున్నట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement