Saturday, November 23, 2024

Supreme Court | యోగా అంశం వేరు.. పతంజలి ఉత్పత్తులు వేరు

పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు ప్రకటనల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పతంజలి సంస్థ సహ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా యోగాకు ఎంతో చేశారంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీనిపై జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ అమానుల్లాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ, యోగా ప్రాచుర్యానికి ఆయన చాలానే చేశారు.

అది మంచి విషయమే. కానీ యోగా వేరు.. పతంజలి ఉత్పత్తుల అంశం వేరు. రాందేవ్‌ ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరు. దానిని ఆయన సరైన మార్గంలో ఉపయోగించాలి అని ధర్మాసనం హితవు పలికింది. వివాదానికి కారణమైన పతంజలి ఉత్పత్తుల నిల్వలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే రాందేవ్‌తోపాటు, బాలకృష్ణకు కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను అంగీకరించింది.

ఐఎంఏ చీఫ్‌కు చివాట్లు..

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) అధ్యక్షుడు ఓ ఇంటర్వ్యూలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించింది. వాక్‌ స్వాతంత్య్రం ముఖ్యమేనన్న సుప్రీంకోర్టు, కొన్నిసార్లు మాటల్లో నిగ్రహం పాటించాలని హితవు పలికింది. ఇటీవల పతంజలి కేసు విచారణ సందర్భంగా కొందరు వైద్యుల అనైతిక చర్యలను కోర్టు ప్రస్తావించింది. ఐఎంఏ తమ సభ్యుల ప్రవర్తనను సరిచేసుకోవాలని సూచించింది.

అదేరోజు ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఐఎంఏ చీఫ్‌ అశోకన్‌, ధర్మాసనం వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీనిపై గతంలో అసంతృప్తి వ్యక్తంచేసిన ధర్మాసనం,మంగళవారం విచారణ సందర్భంగా మరోసారి ఆయన్ను మందలించింది. ఐఎంఏ అధ్యక్షుడిగా బాధ్యత కలిగివుండాలి. కానీ మీ ఇంటర్వ్యూల్లో మాకది కనిపించలేదు. మీ అవతలి పక్షం వ్యక్తులు అదేవిధంగా ప్రవర్తిస్తే మీరు ఏం చేసేవారు? ఈ కోర్టుకు పరుగెత్తుకుంటూ వచ్చేవారు అంటూ ఐఎంఏ క్షమాపణల అఫిడవిట్‌పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపైతదుపరి విచారణను జూన్‌9కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement