న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా రూపాంతరం చెందుతున్న దశలో దేశ రాజధాని కేంద్రంగా పార్టీ విస్తరణపై ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర రావు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సర్దార్ పటేల్ మార్గ్‌లో అద్దెకు తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్, బుధవారం సాయంత్రం వసంత్ విహార్‌లో నిర్మాణం జరుపుకుంటున్న పార్టీ సొంత భవనాన్ని సందర్శించారు. సాయంత్రం వరకు తుగ్లక్ రోడ్‌లోని తన నివాసం నుంచి ఎటూ వెళ్లని కేసీఆర్, సాయంత్రం గం. 4.30 సమయంలో వసంత్ విహార్ వెళ్లారు.
ఆయన వెంట పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దామోదర రావు, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులున్నారు. గత ఏడాది పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం భూమిపూజ చేసిన కేసీఆర్, నిజానికి ఈ ఏడాది దసరా నాటికి నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే అనివార్య కారణాలతో నిర్మాణ పనులు పూర్తికాలేదు.
అందుకే పార్టీ జాతీయస్థాయి కార్యాకలాపాల నిర్వహణ కోసం ఎస్పీ మార్గ్‌లో ఖేత్రి ట్రస్ట్‌కు చెందిన భవనాన్ని ఏడాదిపాటు లీజుకు తీసుకుని అవసరమైన మార్పులు, చేర్పులు చేయిస్తున్నారు. సొంత భవనం సిద్ధమయ్యాక పార్టీ కార్యాకలాపాలను పూర్తిగా సొంత భవనానికి బదిలీ చేయనున్నారు. ఏడాదిలోగా పార్టీ కార్యాలయ భవనాలు నిర్మాణం పూర్తయ్యేలా ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరికొన్ని నిర్మాణపరమైన సూచనలు కూడా చేసినట్టు తెలిసింది. అరగంటకు పైగా నిర్మాణ పనులను పర్యవేక్షించిన సీఎం కేసీఆర్, అనంతరం తుగ్లక్ రోడ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.