బాండ్లకు సంబంధించి మోసపూరిత చర్యలకు పాల్పడిందంటూ ప్రభుత్వ రంగ బ్యాంకు యస్ బ్యాంకుకు సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) రూ .25 కోట్లు జరిమానా విధించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు వేసిన కస్టమర్లను బలవంతంగా, మోసపూరితంగా ఏటీ-1(అడిషనల్ టైర్ వన్ బాండ్లు) బాండ్ల వైపు మళ్లించిందని యస్ బ్యాంకుపై కస్టమర్ల నుంచి ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ జరపగా, ఏటీ-1 బాండ్ల విషయంలో వారి ఫిర్యాదులు వాస్తవమే అని తేలింది.
2016 డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి 29,2020 మధ్యకాలంలో వీటిని విక్రయించినట్టు సెబీ తెలిపింది. యస్ బ్యాంక్ యాజమాన్యం నేరుగా తమ బ్యాంక్‌లోని 1300 మంది కస్టమర్ల చేత వీటిని కొనుగోలు చేయించిందని, ఆయా పెట్టుబడులను సంబంధిత వ్యక్తుల ప్రమేయం లేకుండా రిస్కీ బాండ్లలోకి మార్చి విక్రయించిందని సెబీ ఆరోపించింది. అధిక రాబడుల పేరుతో బ్యాంకు ఉద్యోగులు మోసంగించారని సెబీ నిర్ధారించింది. తద్వారా 70,80,90 ఏళ్ల వయసున్న చాలామంది వినియోగదారులు ప్రభావితమయ్యారని వాదించింది. ఫలితంగా యస్ బ్యాంక్ ప్రైవేట్ వెల్త్ మేనేజ్‌మెంట్‌కి చెందిన వివేక్ కన్వర్‌పై రూ.కోటి, ఆశిష్ నాసా, జస్జీచ్ సింగ్ బంగాపై తలో రూ.50 లక్షలు జరిమానా విధిస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది.