Friday, November 22, 2024

హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్.. భారీగా పొగమంచు కురిసే అవకాశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చలి పంజా విసరుతోంది. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సుమారు 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ అయంది. నగరంలో పొగ మంచు కురువనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌, చార్మినార్‌, ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి జోన్లలో చలి ప్రభావం ఎక్కువగా ఉండ నుందని తెలిపింది. విపరీతంగా మంచు కురిసే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో వాహనాలతో బయట సంచరించొద్దని హెచ్చరించింది. ఆస్తమా, సైనసైటిస్‌ వంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించింది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 12 డిగ్రీలు, భద్రాచలంలో 18.5 డిగ్రీలు, హకీంపేటలో 15.2 డిగ్రీలు, హన్మకొండలో 16.5డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 17.1 డిగ్రీలు, మెదక్‌లో 17.5 డిగ్రీలు, నిజామాబాద్‌లో 16.8 డిడ్రీలు, రామగుండంలో 14.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement