అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో అధికార వైసీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్ణయించుకున్న ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా సరికొత్త వ్యూహంతో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పై దూకుడు పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆయన రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా గురి పెట్టారు. ఇదే క్రమంలో టీడీపీ అసమ్మతి నేతలు వైసీపీ వైపుదృష్టి సారించేలా వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కైకలూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జయమంగళ వెంకటరమణకు వైసీపీ తీర్ధం ఇచ్చారు. అదే తరహాలో మరి కొన్ని జిల్లాల్లో కూడా టీడీపీ అసమ్మతి నేతలను వైసీపీ గూటికి తీసుకువచ్చేలా ఆయా ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి చర్చలు జరుపు తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అధికార వైసీపీ నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన నేపధ్యంలో జిల్లాలో ఆ లోటును భర్తీ చేసుకునేలా ఆయా ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్‌ను తిరిగి ఫ్యాను గూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు తెరవెనుక జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొంతమంది టీడీపీ అధిష్టాన తీరుపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుసుకున్న సీఎం జగన్ వారితో కూడా చర్చలు జరిపి వైసీపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టీడీపీ వ్యతిరేక వర్గాన్ని..చేరదీయడమే లక్ష్యం
రాజకీయ పార్టీల్లో కొంత అసంతృప్తి ఉండడం సర్వ సాధారణం. ఎన్నికల సమయంలో అసమ్మతి గళం ఒక్కొక్కటిగా బయట పడుతుండడం, అనేక సందర్భాల్లో తంతుగా జరుగుతూనే ఉంటుంది. అయితే అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలో కూడా అసమ్మతి నేతలు ఉంటూనే ఉంటారు. ప్రస్తుతం సీఎం జగన్ సొంత పార్టీని పటిష్టం చేయడంతో పాటు ప్రతిపక్షాన్ని మరింత బలహీనపరిచే ప్రయత్నాలను శరవేగంగా చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ వ్యతిరేక నేతలను ఆయా జిల్లాల్లో స్థానికంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వారికి వైసీపీలో ప్రాధాన్యత కల్పించాలని యోచిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కైకలూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేతను వైసీపీలోకి ఆహ్వానించడంతో పాటు ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా ఇచ్చారు. ఈ నేప ధ్యంలో టీడీపీ నుంచి వలస వచ్చే వారికి వైసీపీలో ఏమాత్రం ప్రాధాన్యత తగ్గ దన్న నమ్మకాన్ని ఇతర జిల్లా నేతలకు కలిగించేలా సీఎం జగన్ జయ మంగళకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ టిక్కెట్‌ను ఇస్తున్నట్లు ప్రకటించారు.
నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులకు వల..?
అధికార వైసీపీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా మొదటి స్థా నంలో ఉంది. అయితే ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పార్టీలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో సీఎం జగన్ నెల్లూరుపై ప్రత్యే కంగా దృష్టి సారించారు. ముందుగా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న సంఘటనలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ నియోజక వర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేలా వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే నెల్లూరు రూరల్ ఇన్చార్జ్ పగ్గాలను ఎంపీ ఆదాల ప్రభా కర్రెడ్డికి అప్ప గించారు. అయితే ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లోపు టీడీపీ మరింత బల హీన పరచాలన్న యోచనతో ప్రస్తుతం టీడీపీ ఇన్చార్జ్ గా కొనసా గుతున్న అబ్దుల్ అజీజ్‌ను వైసీపీలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచన కూడా వైసీపీ పెద్ద లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మైనార్టీ వర్గాల్లో బలమైన నాయకుడిగా ముద్ర పడ్డ అబ్దుల్ అజీజ్, 2014 ఎన్నికల సమయంలో వైసీపీ మేయర్‌గా ఉన్న అజీజ్ ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో 2015లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచే నెల్లూరు రూరల్ అభ్యర్ధిగా పోటీచేసి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం కోటంరెడ్డి వైసీపీకి దూరమై సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్న నేపధ్యంలో అజీజ్‌ను సైకిల్ దించి ఫ్యాను గూటికి తీసుకురావడం ద్వారా నియోజకవర్గంలో సమీకరణలు శరవేగంగా మారే అవకాశాలు ఉన్నాయన్న దిశగా సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.