అమరావతి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఈనెల 28న సామాజిక న్యాయభేరి బహిరంగ సభ నిర్వహించనున్నట్టు రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని తెలిపారు. చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ ఈనెల 26న ప్రారంభయ్యే సామాజిక న్యాయ బస్సు యాత్రం 28 నాటికి పల్నాడు చేరకుంటోందనీ.. అదే రోజు నరసరావుపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు చోట్ల సామాజిక న్యాయభేరీ బహిరంగసభలు నిర్వహించనునన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో బీసీలకూ, దళితులకు రాజకీయంగా అగ్రస్థానం కల్పించిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. గతంలో బీసీల ఓట్లను దండుకున్న వారే తప్ప వారికి పదవులు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఇపుడు ఓట్లు మీవే.. సీట్లు మీవే.. మంత్రి పదవులు మీవే అనే సామాజిక దృక్పధాన్ని సీఎం జగన్ ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారని అన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేబినెట్లో 70 శాతం పదవులిచ్చారు. 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల్లో పది మంది బీసీలే ఉన్నారన్నారు. మహానాడును అడ్డుకోవాల్సిన అగత్యం వైసీపీకి లేదు…ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు కార్యకర్తలను భ్రమల్లో ఉంచుతున్నారు..రెండేళ్ల తరువాత షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వస్తాయి..టీ-డీపీ మళ్లీ చిత్తు చిత్తుగా ఓడిపోవటం కూడా తధ్యమన్నారు. 2019 ఎన్నికల్లోనే టీ-డీపీనీ, చంద్రబాబునూ, లోకేష్ ను ప్రజలు బాదేశారు..ఇపుడు మళ్లీ బాదుడే బాదుడని ఊళ్ల మీద ఎందుకు పడుతున్నారో అర్ధం కావటం లేదన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, మున్సిపల్, పంచాయతీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రజలు బాగానే బాదారు కదా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు అసహనంతో మతిభ్రమించి మాట్లడుతున్నాడని ధ్వజమెత్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..