టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కస్టడీలో ఉన్న ఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా అసత్యపు ప్రచారం చేశారని… ఈ ఏడాది ప్రపంచ అబద్ధాల పోటీలో వారు ఫస్ట్ ప్రైజ్‌కు ఎంపికైనట్టేనని ఎద్దేవా చేశారు. కొన్నేళ్లుగా ఈ అవార్డు చంద్రబాబు, పచ్చ పార్టీ ప్రముఖులకే దక్కుతోందన్నారు. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వ్యవస్థలకు విశ్వసనీయత లేకుండా చంద్రబాబు భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఒక్కో ఆసుపత్రిని పచ్చ పార్టీ బ్రాంచి ఆఫీసు స్థాయికి దిగజార్చారని అన్నారు. ఓ ఆసుపత్రిలో 10 మంది కరోనా రోగులు ఆహుతైపోతే ఆ ఆసుపత్రిని చంద్రబాబు వెనకేసుకొచ్చారని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి తగినంత ఆక్సిజన్ సరఫరా లేక రోగులు యాతన పడుతుంటే ఒక్క లేఖ అయినా రాశావా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
కరోనా వైరస్ కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాని మోదీతో పాటు, కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా ప్రశంసిస్తున్నారని… అయినా పచ్చ పార్టీ పెద్దలకు అరెస్ట్‌పై గొడవ చేయడం తప్ప, మరేమీ పట్టడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రజల పట్ల బాధ్యత లేని టీడీపీకి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. గత రెండేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికలో ప్రజలు ఆ పార్టీకి వాత పెట్టారని… అయినా బుద్ధి రాలేదన్నారు.