తన ప్రత్యర్థులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్, ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. తన ఫోన్ ను తీసుకున్న సీఐడీ డీజీ సునీల్ కుమార్.. ఆ ఫోన్ నుంచి కొందరికి సందేశాలు పంపారని ఆరోపించారు. ఆ ఫోన్‌ను వాడకుండానే, దాని నుంచి సందేశాలు పంపగల ఘనుడు సునీల్ కుమార్ అని వ్యాఖ్యానించారు. గతంలో కూడా సునీల్‌కుమార్‌కు ఆయన భార్యతో మనస్పర్ధలు వచ్చాయని గుర్తుచేశారు. అయితే భార్య ఉపయోగించే కంప్యూటర్ లోకి ఆమె అనుమతి లేకుండా చొరబడి, ఆ కంప్యూటర్ నుంచి ఇతరులకు సందేశాలు పంపారని, ఈ విషయం రికార్డుల్లో కూడా ఉందన్నారు. తన ఫోన్ నెంబరును ఉపయోగించి కూడా అదే విధంగా సందేశాలు పంపారని రఘురామ ఆరోపించారు. పీవీ రమేశ్ అప్రమత్తం చేయడంతో తనకు అసలు విషయం తెలిసిందన్నారు.
అప్పట్లో న్యాయమూర్తులపైనా ఓ సాఫ్ట్ వేర్ ప్రయోగించారని పత్రికా కథనం వచ్చిందని రఘురామ తెలిపారు. సునీల్ కుమార్ పెగాసస్ తరహా సాఫ్ట్ వేర్ లు ఉపయోగిస్తూ ఇలాంటి సందేశాలు రూపొందిస్తున్నారని, ఏదైనా దరిద్రమైన పని చేసినా అందంగా చేయాలని… తనకు ఎవరితోనో సంబంధం ఉందని, అవతలి నుంచి కొంత అమౌంట్ వస్తుందని ఓ సందేశం రూపొందించారని.. కానీ అది తన అకౌంట్ కాదు, తనకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు. కానీ దాని ఆధారంగా సునీల్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు, ఈడీ జాయింట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసినట్టు, ఆ పిటిషన్ తాలూకు ప్రతి సాక్షికి వచ్చినట్టు చెబుతున్నారని రఘురామ పేర్కొన్నారు. మరి సునీల్ కుమార్ ఫిర్యాదు చేస్తే అది సాక్షికి ఎలా వచ్చిందని నిలదీశారు. మరోవైపు పిల్లలను (ఎంపీలు) తీసుకుని ఢిల్లీలో అందరినీ కలుస్తున్న దొంగోడు విజయసాయిరెడ్డికి ఎలా అందిందని ప్రశ్నించారు. అంటే సునీల్ కుమార్, విజయసాయి మిలాఖాత్ అయ్యారని అనుకోవాలా? ఇద్దరూ తోడుదొంగలు అనుకోవాలా? అంటూ రఘురామ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ వార్త కూడా చదవండి: మాన్సాస్ ట్రస్టు ఈవోపై హైకోర్టు ఆగ్రహం