Saturday, November 23, 2024

వైద్యుల నివేదికతో రఘురామ డ్రామా తేటతెల్లమైంది: అంబటి

ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రాణాలకు హాని కలిగించాల్సిన అవసరం ప్రభుత్వానికి, పోలీసులకు లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అమరావతిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… ‘ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడనివి ఎంపీ రఘురామరాజు మాట్లాడారు. అవి కులాలు, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. శాంతిభద్రతల సమస్యలను సృష్టించాలని చూస్తే చట్టం ఊరుకోదు. సాక్ష్యాధారాలు దొరికాక వదిలే ప్రసక్తి లేదు. రెచ్చగొడుతూ రఘురామకృష్ణంరాజు మాట్లాడిన 46 సీడీలను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఒక బలమైన నేరారోపణతోనే నిందితుడిని అరెస్టు చేస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. వైసీపీ తరఫున ఎంపీగా గెలుపొంది ప్రభుత్వం, సీఎంలను అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నారు. ఆయన అలా విమర్శించడంపై చంద్రబాబు ఒక్కసారీ స్పందించలేదు. ఇప్పుడు ఎందుకు అరెస్టు చేస్తారంటూ గవర్నర్‌, ఇతరులకు లేఖలు రాస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎంపీని అరెస్టు చేస్తే తప్పేంటి? హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ డిస్మిస్‌ కాగానే ఆయన నాటకాలు మొదలుపెట్టారు. ఎంపీని ఎవరైనా కొట్టారా? ఆయనే కొట్టుకున్నారా? అనేది గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల బృందం కోర్టుకు అందించిన నివేదికతో తేటతెల్లమైంది. డ్రామా అని వెల్లడైంది’ అన్నారు.

‘చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం, పోలీసులను అభాసుపాలు చేసే కుట్ర ఎందుకు చేస్తున్నారు? సంగం డెయిరీ అక్రమాల కేసులో ధూళిపాళ్ల నరేంద్ర, ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడిని గతంలో పోలీసులు అరెస్టు చేసినపుడు వారిని కొట్టారా? రాష్ట్రంలో ధర్మం, న్యాయానికి ఎక్కడా ఇబ్బంది కలగదు. గతంలో ఒక అబద్ధపు కేసులో అప్పటి సీఐడీ జేడీ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేస్తున్నపుడు రఘురామకృష్ణంరాజును కూడా విచారించాలని ఇదే చంద్రబాబు కోరారు. ఇప్పుడు ఆయన్నే ఎందుకు సమర్థిస్తున్నారు? ఎంపీ రఘురామ ఢిల్లీలో కూర్చుని టీడీపీ, చంద్రబాబుకు లాబీయింగ్‌ చేస్తున్నారు. రఘురామను చంపే కుట్ర జరుగుతోందని చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రఘురామరాజు రాజద్రోహాన్ని సమర్థిస్తున్న అసాంఘిక శక్తులు ఎవరో బయటపడింది. వారినీ విచారించాలి’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement