Friday, November 22, 2024

రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్న యాసంగి వరిసాగు.. పడిపోతున్న భూగర్భ జలాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఓ వైపు విద్యుత్‌కోతలు, మరోవైపు మార్చిలోనే దంచికొడుతున్న ఎండలు, రోజు రోజుకూ పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు… ఈ విపత్కర పరిస్థితుల్లో అన్నదాతలు యాసంగి వరి పంటపై ఆశలు వదిలేసుకున్నారు. యాసంగి వరి దిగుబడి చేతికొస్తుందన్న నమ్మకానికి నీళ్లు వదిలేశారు. ఈ యాసంగి సీజన్‌లో వరిసాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక సూచన చేయకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున యాసంగిలోనూ వరి సాగుకు పూనుకున్నారు. గతేడాది 2021-22 ఏడాదిలో యాసంగిలో వరి సాగుచేయవద్దనడంతో రైతులు చాలా వరకు నియంత్రణ పాటించారు. అయితే ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడం, డిసెంబర్‌ వరకు బావులు, బొర్లలో భూగర్భజలాలు సమృద్ధిగా ఉండడం, చెరువులు, ప్రాజెక్టుల వంటి నీటి వనరుల్లో సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున వరిసాగు చేశారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈఏడాది 2022-23 యాసంగిలో దాదాపు 60లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వరి సాగు అయినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే జిల్లాకు కనీసం నాలుగైదు లక్షల ఎకరాల్లో వరి పంట ఎండిపోతుందన్న ఆంధోళన వ్యక్తమవుతోంది. రబీ/యాసంగిలో ఇంత పెద్ద ఎత్తున వరి సాగవడం రికార్డు అని పేర్కొంటున్నారు. అయితే డిసెంబరు నుంచి జనవరి రెండో వారం వరకు వరినాట్లు పూర్తి చేసిన రైతులకు ఆ ఆనందం అట్టే నిలవలేదు. ఫిబ్రవరి మూడో వారంలోనే ఉష్ణోగ్రతలు పెరగడంతో వ రి పంటకు ఎక్కువ నీటిని పెట్టాల్సి రావడంతో భూగర్భజలాలు వేగంగా అడుగంటి పోతున్నాయి.అదే సమయంలో అప్రకటిత కరెంటు కోతల కారణంగా వచ్చే కొద్దిగంటల కరెంటుకు ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన వరి పంటకు నీరందించడం గగనమైపోతోంది.

- Advertisement -

ఫలితంగా ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి మొదటి వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన విస్తీర్ణంలో వరి పంట ఎండిపోతుండడంతో రైతులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సాగునీటి వనరులు ప్రాజెక్టులు, కెనాల్‌ కింద వరి సాగు చేసిన రైతుల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. కెనాళ్లలో నీళ్లు వస్తాయన్న ఆశతో పలు జిల్లాల్లో వరిసాగు చేసిన రైతులు తమ కళ్లముందే పంట ఎండిపోతుండడంతో చేసేదేమి లేక కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో చీడపీడల తాకిడికి వరిసాగు ఆశాజనకంగా లేదని, నష్టాలనే మిగిల్చిందని, ఇక రబీలో కరెంటు కోతలు, సాగునీటి ఎద్దడితో ఈ ఏడాది వరిసాగు నష్టాలనే మిగల్చనుందని వాపోతున్నారు.

ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 4.5 మీటర్ల లోతులో భూగర్భజలాలు అందుబాటులో ఉండగా ఇప్పుడు 6 నుంచి 7 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఒక్క నెలలోనే దాదాపు 2 నుంచి 3 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పడిపోవడంతో బావులు, బోర్ల కింద వరిసాగు చేసిన రైతులు పంటపై ఆశలు వదిలేసుకున్నారు. ప్రస్తుతం వరి పైర్లు చిరు పొట్టదశలో ఉన్నాయి. ఏప్రిల్‌ మూడో వారం వరకు నీరు పెట్టాల్సి ఉంటుంది. మార్చి మొదటివారంలోనే భూగర్భ జలాలు పాతాలానికి పడిపోతే ఇక మార్చి చివరివారం, ఏప్రిల్‌ మొదటివారంలో ఇంకెంత లోతుకు వెళతాయోనన్న కలవరం రైతుల్లో కనిపిస్తోంది.
ఏ జిఆలో ఎంత మేర వరి పంట ఎండిపోయిందన్న విషయంలో వ్యవసాయశాఖ సర్వే చేసి లెక్క తేల్చి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్‌ చేస్తోంది. నివేదిక ఆధారంగా బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement