Saturday, November 23, 2024

బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ రేపటికి తుపాను గా మారుతుందని, ఆపై రాగల 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. యాస్ తుపాను ఈ నెల 26వ తేదీ ఉదయం ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని తాకుతుందని, సాయంత్రానికి తీరాన్ని దాటి భూభాగంపై ప్రవేశిస్తుందని ఐఎండీ తాజా బులెటిన్ లో వెల్లడించింది. యాస్ తుపాను ప్రభావం ఏపీ, తెలంగాణపై కొద్దిమేర మాత్రమే ఉంటుందని తెలిపింది. రేపు ఉదయం కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు కురుస్తాయని పేర్కొంది. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని, ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్నాయని ఐఎండీ తెలిపింది.

ఇక తుపాను ‘యాస్’పై ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ), టెలికం, విద్యుత్, పౌర విమానయాన శాఖ, ఎర్త్ సైన్సెస్ శాఖల కార్యదర్శులతో భేటీ అయిన ఆయన.. తుపాను పరిస్థితులను తెలుసుకున్నారు. హోం మంత్రి అమిత్ షాతో పాటు ఆయా శాఖల మంత్రులూ సమావేశానికి హాజరయ్యారు. వీలైనంత త్వరగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అందుకు తుపాను ప్రభావిత రాష్ట్రాలతో అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయించుకోవాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత కార్యకలాపాల్లో పాల్గొనే వారిని వేగంగా తరలించాలని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement