చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వ్యాపించినట్లు ఆరోపణలు రాగా వాటిని నిజం చేసే విధంగా తాజాగా ఓ నివేదిక బయటపడింది. కరోనా వైరస్ మహమ్మారి రూపం దాల్చడానికి ముందు.. వుహాన్ పరిశోధనశాల నుంచి లీకైనట్లు తెలుస్తోంది. వుహాన్‌లో ఉన్న వైరాలజీ ఇన్స్‌టిట్యూట్‌లో పనిచేసే ముగ్గురు పరిశోధకులు 2019 నవంబర్‌లో ఆస్పత్రుల చుట్టూ తిరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. మహమ్మారిపై చైనా ప్రకటన చేయడానికి ముందే.. వుహాన్ ల్యాబ్‌లో ఉన్న సిబ్బంది ఆ వైరస్‌తో తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన కథనాన్ని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. అయితే గతంలో అమెరికా ఇంటెలిజెన్స్ ఈ నివేదికను ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ల్యాబ్‌లో పనిచేసే సిబ్బంది హాస్పిటళ్లకు వెళ్లిన తీరు, వారికి ఉన్న అనారోగ్యం, కరోనా ఉదృతి పెరగడానికి ముందు అక్కడ జరిగిన పరిణామాలు అనేక అనుమానాలు దారి తీస్తున్నట్లు ఆ పత్రిక పేర్కొంది.
వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ వ్యాప్తి జరిగినట్లు మొదట్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేశారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఓ సారి దర్యాప్తు చేపట్టింది. వుహాన్ నగరాన్ని విజిట్ చేసిన ఆ బృందం.. కరోనా వైరస్ సహజ సిద్దంగానే జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు పేర్కొన్నది. కానీ ఆ నివేదికపై పలు దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించేందుకు మళ్లీ దర్యాప్తు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశమైన నేపథ్యంలో వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనాన్ని ప్రచురించింది.