ప్రభ్యన్యూస్ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి: కార్పొరేట్ విద్య పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీల మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చేసి.. కేవలం జేబులు నింపుకోవడమే లక్ష్యంగా శ్రీచైతన్య కాలేజీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. పాఠాలు బోధించాల్సిన అధ్యాపకులే, విద్యార్థుల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. విద్యార్థులను కాటికి పంపుతున్నారు. ఇంత బరితెగింపు వ్యవహారంతో శ్రీ చైతన్య విద్యాసంస్థలు హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని.. చేస్తున్న మోసాలను ఏకంగా రాష్ట్ర ఇంటర్ బోర్డు సైతం అధికారికంగా బయటపెట్టింది. ఆత్మహత్యకు గురైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ మృతిపై జరిగిన వాస్తవాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపేందుకు సిధ్దం చేసింది. పేద విద్యార్థులను ఆర్థికంగా దోపిడి చేస్తూ, అమాయక తల్లిదండ్రులను మరింత అప్పుల భారంలోకి నెట్టేలా వ్యవహరిస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల మోసాల పుట్ట పలుగుతోంది. అనేక ఏళ్లుగా రెండు విద్యాసంస్థలపై అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ, చివరకు ఓ విద్యార్థి ఆత్మహత్యతోనైనా ఆలస్యంగా ఇంటర్ బోర్డు అధికారులు కదిలారనే చర్చ జరుగుతోంది. తాజాగా నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో జరిగిన దారుణంపై నివేదికను ఇంటర్ బోర్డు సిద్దం చేయడంతో, శ్రీచైతన్య ఆగడాలు మరిన్ని వెలుగులోకి రానున్నాయి.
విద్య పేరిట శ్రీ చైతన్య మోసం..
ఇంటర్ విద్యలో తమకు ఎవరూ సాటిలేరని చెప్పుకునే శ్రీ చైతన్య విద్యాసంస్థల అసలు బాగోతం ఆలస్యంగా బయట పడుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులను తమదైన శైలిలో నమ్మిస్తూ, కాలేజీలో చేర్పించడం వెనుక శ్రీ చైతన్య మోసాల కుట్ర ప్రధానంగా కనిపిస్తోంది. ఏ తల్లిదండ్రులు అయినా సరే తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎంతటి ఆర్థిక కష్టాలనైనా ఎదుర్కొంటారు. ఈ అంశాన్ని ఆసరగా చేసుకుంటు-న్న శ్రీ చైతన్య ఇంటర్ కాలేజీలు అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతున్నాయి. అడ్మిషన్ ఒక కాలేజీలో.. పాఠాలు బోధించేది మాత్రం మరో కాలేజీలో అన్నట్లు-గా దందాను ఏళ్ల తరబడిగా చేస్తున్నాయి. ఈ విషయం ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసినా, ఏనాడు పట్టించుకున్న పాపానా పోలేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా నార్సింగి శ్రీ చైతన్య ఘటనతో.. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల నుంచి వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఇంటర్ బోర్డు అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో.. ప్రాథమికంగా అనేక రకాల శ్రీ చైతన్య మోసాలను గుర్తించారు.
అడ్మిషన్ ఒక చోట.. కోచింగ్ మరో చోట
చదువు పేరిట శ్రీ చైతన్య సాగిస్తున్న మోసం గుట్టు-రట్టయ్యింది. ఏకంగా ఇంటర్ బోర్డు అధికారులే సమగ్ర విచారణ జరిపి మోసాన్ని బయటపెట్టారు. ఇటీ-వల నార్సింగిలోని శ్రీచైతన్య కళాశాల విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసుతో, రంగారెడ్డి జిల్లా ఇంటర్ బోర్డు అధికారులను ఇంటర్ బోర్డు సెక్రటరీ సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ముందుగా ఘటన జరిగిన మరుసటి రోజున నార్సింగి శ్రీ చైతన్య కాలేజీకి ఇంటర్ బోర్డు అధికారులు షోకాజ్ నోటీ-సులు జారీ చేశారు. ఆ తర్వాత నేరుగా నార్సింగి శ్రీ చైతన్య కాలేజీకి వెళ్లిన అధికారులు, అక్కడ సాత్విక్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. అంతేకాదు సాత్విక్ అడ్మిషన్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీ గుర్తింపు నెంబర్ 58520 లో సాత్విక్ అడ్మిషన్ తీసుకోగా, అతనికి సంబంధించిన ఇంటర్ బోర్డు ఫీజును మాత్రం నార్సింగి లోని వైఎస్సార్ విగ్రహం దగ్గర ఉన్న శ్రీ చైతన్య కాలేజీ గుర్తింపు నెంబర్ 58485 నుంచి ఉందని గుర్తించామని , ఇది ప్రాథమికంగా మోసమని, రంగారెడ్డి జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వానికి నివేధిక సిద్ధం చేశారు. ఇంతటి మోసం బయటపడినా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటు-ందనేది ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.
నేడు ఇంటర్ కాలేజీ యాజమాన్యాలతో మంత్రి సబితా భేటీ..
విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలతో విద్యాశాఖ అధికారులు కదిలారు. నేడు ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటి కానున్నారు. జూబ్లిహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో సాయంత్రం నాలుగు గంటలకు జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో భేటి కానున్నారు. ఇందుకు సంబంధించి 14 జూనియర్ కాలేజీలకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాగా సమావేశంలో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారనేదానేది చర్చనీయాంశంగా మారింది.