న్యూఢిల్లీ – నార్కో అనాలసిస్ పరీక్షలకు తనతో పాటు తనపై ఆరోపణలు చేసిన మహిళా రెజ్లర్లు కూడా చేయించుకోవాలని కండిషన్ విధించిన రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ కండిషన్ ను ప్రస్తుతం నిరసనలు చేస్తున్న అందరూ రెజ్లర్లు ఓకే చెప్పారు.. నార్కో టెస్ట్ కు తాము సిద్ధమని టాప్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సోమవారం ప్రకటించారు. తాను ఒక్కటే కాదని , ఆయనపై ఫిర్యాదు చేసిన వారంతా నార్కో పరీక్షలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘అతను వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియాను మాత్రమే ప్రస్తావించారు. మేమిద్దరమే కాదు బ్రిజ్ భూషణ్ పై ఫిర్యాదు చేసిన వారంతా ప్రత్యక్ష నార్కో పరీక్షలకు సిద్ధంగా ఉన్నారు’ అని వినేశ్ వెల్లడించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. గత నెల రోజులుగా వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్‌లతోపాటు మరికొంత మంది మహిళా రెజ్లర్లు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా బజరంగ్ పునియా వంటి ఒలింపిక్ పతక విజేతలు సైతం పాల్గొంటున్నారు. మల్లయోధుల ఆందోళనకు రైతు సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం హరియాణాలో జరిగిన ఖాప్ పంచాయితీ సమావేశంలో బ్రిజ్ భూషణ్‌కు నార్కో పరీక్షలు నిర్వహించాలని ఖాప్ పంచాయితీ పెద్దలు తీర్మానించారు. దీనిపై స్పందించిన బ్రిజ్ భూషణ్ నార్కో అనాలసిస్ పరీక్షలకు తాను సిద్ధమని అయితే తనతోపాటు వినేశ్ ఫొగాట్ బజరంగ్ పునియా కు సైతం నార్కో పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తాజాగా వినేశ్ పైవిధంగా స్పందిస్తూ, సమయం, తేది చెపితే అందరు రెజ్లర్లు హాజరౌతమని చెప్పారు..