- తల్లిదండ్రుల్లో మొదలైన ఆందోళన
- చదువుల కోసం మొదలైన అప్పుల వేట
- కార్పొరేట్ విద్యాసంస్థ ల్లో భారీగా ఫీజుల పెంపు
గ్రేటర్ పరిధిలో ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల దోపిడి కొనసాగుతోంది. త్వరలో 2023-24 విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో పుస్తకాలు, స్టేషనరీతో పాటు స్కూళ్ల యూనిఫామ్స్‌లు తీసుకెళ్లాలని సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం రూ. 20 వేల కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలు గతంలో రెండు సంవత్సరాలు కొవిడ్ ఎఫెక్ట్‌తో కునారిల్లిన సంగతి తెలిసిందే. గత విద్యా సంవత్సరం, త్వరలో ప్రారంభమయ్యే విద్యా ఏడాదికి సంబంధించి.. అనుకూల పరిస్థితులుండటంతో మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాపారంలో సింహభాగం వాటా ఉన్న శ్రీచైతన్య, నారాయణ స్కూళ్లు.. ప్రస్తుతం అనుకూల పరిస్థితులుండటంతో 30-40శాతం మేరకు ఫీజులు పెంచి వసూళ్లు చేస్తుండటం గమనార్హం. మహమ్మారి సమయంలో అంటే గత రెండు సంవత్సరాల్లో భారీగా నష్టపోయిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఇది సామాన్య, మధ్యతరగతి వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపతున్నాయనుకుంటే జూన్ మాసం కాళ్లకు బంధం వేస్తోంది. ఎంత కష్టం వచ్చినా ప్రస్తుతం తప్పించుకునే పరిస్థితులు ఎంతమాత్రం కనిపించడం లేదు. అప్పులు చేసైనా ఈ గండం నుండి గట్టెక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న విద్యా సంస్థలు పునర్ ప్రారంభం..పిల్లల చదువుల కోసం పైసా పైసా కూడబెట్టుకున్న డబ్బులు ఒక్కసారిగా కరిగిపోయే కాలం ఆసన్నమైంది. ఫీజులతో పాటు పుస్తకాలు.. బ్యాగులు అన్నీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డొనేషన్ వసూళ్లు..!
మహానగరంలో దాదాపు 100 వరకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఉన్న స్కూళ్లలో డొనేషన్ల దోపిడి కొనసాగుతోంది. ముందుగా అప్లికేషన్ ఫారం నింపాలి. దాని ఖరీదు రూ.500 నుంచి రూ.5 వేలకు పైగా ఉంటుంది. ఇక సీటు కోసం మాట్లాడలంటే ముందుగా డొనేషన్ చెల్లించాలి. అదీ రూ.10 వేల నుంచి రూ.లక్షల్లో కట్టేందుకు సిద్ధపడితే అక్కడ సీటు ఉంటుంది. ఇంటర్నేషనల్, కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థ అయితే కనీసం రూ.10 లక్షలకు తక్కువగా డొనేషన్లు ఉండవు.. వీటన్నింటికి కొత్తపేర్లతో యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ఇక ట్యూషన్ ఫీజు, ఎంత చిన్న ప్రైవేట్ పాఠశాల అయినా..కనీసం రూ.20వేల నుంచి తరగతిని బట్టి రూ.లక్షల్లో వసూలు చేస్తారు. ఇక సీటు లభించినా తర్వాత అడ్మిషన్ ఫీజు, స్పోర్ట్స్ , స్పెషల్, కల్చరల్ ఫీజు ఇలా అనేక రకాల ఫీజులను యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి వసూలు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
నిలువు దోపిడి..!
సర్కార్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఫీజు ఉండదు. ప్రభుత్వమే పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. దూర ప్రయాణమైతే ప్రభుత్వం ట్రావెలింగ్ అలవెన్సు కూడా విద్యార్థులకు అందిస్తోంది. దీనికితోడు రెండు జతల ఏకరూప దుస్తువులను ఇస్తున్నది. అయితే ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల్లోనే విద్యార్థులకు డొనేషన్లు, భారీగా ఫీజులతో పాటు పుస్తకాలు, డ్రెస్సులు, నోట్ పుస్తకాలు ఇలా అన్నీ బయట మార్కెట్లో కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
30-40 శాతం మేర ఫీజుల పెంపు..!
జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో అధికంగా తిష్ట వేసిన శ్రీచైతన్య, నారాయణ స్కూళ్ల యాజమాన్యాలు తమ విద్యా సంస్థల్లో 30-40 శాతం మేర ఫీజులను పెంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులకు తల్లిదండ్రులకు ముందస్తు ఫీజులు చెల్లించాలని, రాయితీలు ఇస్తామని ప్రకటించడంతో పాటు పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ కొనుగోళ్లు చేయాలని తీవ్ర ఇబ్బందుకు గురి చేస్తున్నాయి. తమ పిల్లలను బాగా చదివించి ప్రయోజకులు చేయాలనే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్న కసిని, పట్టుదలను పెట్టుబడిగా భావించి..చైనా మాఫియా వసూళ్లకు పాల్పడుతుండటం గమనార్హం.
అధిక ఫీజులను నియంత్రించాలి: రాము, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు
ప్రభుత్వం ఒకవైపు సర్కార్ పాఠశాలల్లో ఇంగ్లీషు పాఠాలు బోధిస్తామంటూనే మరోవైపు ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలలను ప్రోత్సహించే విధంగా ప్రస్తుత పరిస్థితులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎందుకంటే ఫీజుల నియంత్రణపై మంత్రుల సబ్ కమిటీ వేసి..కాలయాపన చేస్తోంది. ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు లక్షల్లో దోచుకుంటున్న కార్పొరేట్ మాఫియాపై కనీసం నియంత్రణ విధానాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు పర్చడం లేదు. కొవిడ్ కాలంలో జీవో-45 నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రభుత్వం ప్రైవేట్ స్కూలు ఫీజుల నియంత్రణపై కొత్త చట్టం తీసుకురాబోతుందన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆశించినా..కార్యరూపం దాల్చడం లేదు. ఇలా కాలాయాపన తో సర్కార్ ప్రైవేట్, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్ల యాజమాన్యాలకు లోపాయికారి ఒప్పందాలతో కాలం వెళ్లదీయడం ఎంత వరకు సమంజసం. ఇప్పటికైన తక్షణమే ప్రభుత్వం స్పందించి అధిక ఫీజులను నియంత్రించాలి.