Saturday, November 23, 2024

ప్రపంచ శతాధిక వృద్ధురాలు సిస్టర్‌ ఆండ్రీ.. ఫ్రెంచ్‌ మహిళ కు గిన్నిస్‌ గుర్తింపు

ప్రపంచంలో అత్యధిక వృద్ధురాలిగా ఫ్రాన్స్‌కు చెందిన సిస్టర్‌ ఆండ్రీని గిన్నిస్‌బుక్‌ గుర్తించింది. ఈమె 11 ఫిబ్రవరి 1904లో జన్మించించారు. ప్రస్తుతం ఈమె వయసు 118 సంవత్సరాల 73 రోజులు. జపాన్‌కు చెందిన కేన్‌ తనకా (119) సోమవారం మరణించారు. దీంతో జీవించివున్న శతాధిక వృద్ధురాలిగా ఆండ్రీకి గుర్తింపు లభించింది. అంతేగాక జీవించివున్న సన్యాసినిలలో కూడా ఆండ్రీ అందరికంటే పెద్దవారు. ఈమె అసలుపేరు లూసిల్‌ రాండన్‌. 1944లో సిస్టర్‌ ఆండ్రీగా మారారు. ఇప్పటి వరకు నమోదైన ఫ్రెంచ్‌, యూరోపియన్‌ వృద్ధులలో ఆండ్రీ మూడవ వ్యక్తి. ఉపాధ్యాయురాలిగా, గవర్నస్‌గా పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆమె కేథలిక్‌ సన్యాసినిగా మారడానికి ముందు విచీ, ఆవెర్గ్నే-రోన్‌-ఆల్ప్స్‌లోని ఆస్పత్రిలో 28 ఏళ్లపాటు అనాథలు, వృద్ధులకు సేవలు అందించారు.

తన జీవితంలో ఎక్కువభాగం మతపరమైన సేవకు అంకితమయ్యారు. 2019లో ఫ్రాన్స్‌లోని టౌలాన్‌ నగరానికి గౌరవ పౌరురాలిగా ఎంపికయ్యారు. ఈమేరకు పోప్‌ ఫ్రాన్సిస్‌ నుంచి లేఖను అందుకున్నారు. ఇటీవల ఆమె మరొక రికార్డును కూడా దక్కించుకున్నారు. కొవిడ్‌-19 నుంచి బయటపడిన అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు పొందారు. 1918 స్పానిష్‌ ఫ్లూ మహమ్మారి నుంచి బాల్యదశను అధిగమించిన ఆండ్రీ, 2021 జనవరి 16న కొవిడ్‌-19 బారినపడ్డారు. అయితే, కొద్దిరోజుల్లోనే కోలుకున్నారు. తన 117వ పుట్టినరోజును స్వల్ప అలసట మినహా పూర్తి ఆరోగ్యంతో జరుపుకున్నారు. గత 12 ఏళ్లుగా టౌలోన్‌లోని నర్సింగ్‌హోమ్‌లో ఉంటున్నారు. ఇప్పుడు 118 ఏళ్ల వయసులో చక్రాల కుర్చీ సహాయంతో జీవిస్తున్నారు. కొద్దిగా వినికిడి లోపం ఉన్నా, మెదడును చురుగ్గా ఉంచుకునేందుకు ఆమె ప్రయత్నిస్తుంటారు.

రోజూ గ్లాస్‌ వై న్‌.. చాక్లెట్‌..
ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు నిద్రలేస్తాను. ఆ తర్వాత అల్పాహారం తీసుకుంటాను. ఆపై సహాయకులు నన్ను నా డెస్క్‌వద్దకు చేర్చుతారు. అక్కడ చిన్నచిన్న పనులతో బిజీ అయిపోతాను. ప్రార్థన, భోజన సమయాలు, ఉత్తరాలకు ప్రతిస్పందనలతో దినచర్య గడిచిపోతుంటుందని పేర్కొన్నారు. చాక్లెట్లంటే ఎంతో మక్కువ. పైగా రోజూ గ్లాస్‌ వైన్‌ తీసుకుంటారు. బహుశా ఇదే నా దీర్ఘాయువు రహస్యం కాబోలు అని చెబుతుంటారు. యాదృచ్ఛికంగా మరో అత్యంత వృద్ధురాలు జీన్‌ లూయిస్‌ కాల్మెంట్‌ కూడా చాక్లెట్‌, పోర్ట్‌ను తన సుదీర్ఘ జీవిత రహస్యాలుగా పేర్కొన్నారు. 1875 ఫిబ్రవరి 21న జన్మించిన జీన్‌ 122 సంవత్సరాల 164 రోజులు జీవించి 1997లో మరణించారు. జీన్‌ కాల్‌మెంట్‌ రికార్డును అధిగమించడమే ఆండ్రీ లక్ష్యమని నర్సింగ్‌హోమ్‌ సిబ్బంది తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement