అది ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం. అక్కడి జీవన ప్రమాణాలు ప్రపంచంలోని మరే దేశంలో లేవు. అలాంటి దేశానికి వెళ్లి సెటిలవ్వాలని కోరుకోని వారు ఎవరుంటారు? కానీ ఫిన్లాండ్ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మా దేశానికి రండి ప్లీజ్.. అని అక్కడి ప్రభుత్వం ఇప్పుడు ప్రపంచ దేశాల ప్రజలకు ఆహ్వానం పలుకుతోంది.
ఫిన్లాండ్ వరుసగా నాలుగేళ్ల నుంచి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలుస్తూ వస్తోంది. అయితే చాలా పాశ్చాత్య దేశాల్లాగే ఫిన్లాండ్ కూడా ఎక్కువ జనాభా వృద్ధి లేకపోవడమన్న సమస్యతో సతమతమవుతోంది. దీనివల్ల దేశంలో రోజురోజుకూ పని చేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. ప్రతి 100 మంది పని చేసే వాళ్లలో 39.2 మంది 65 ఏళ్లకుపైబడిన వాళ్లే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో జపాన్ తర్వాత ఆ స్థాయిలో వృద్ధ జనాభా సమస్య ఎదుర్కొంటున్న దేశం ఫిన్లాండే. 2030 కల్లా ఈ దేశంలో వృద్ధుల జనాభా 47.5 శాతానికి చేరుతుందని అంచనా.
ప్రభుత్వం ఏం చేస్తోంది
ఏ దేశానికైనా యువతే కీలకం. ఇప్పుడు ప్రపంచమంతా ఇండియాలాంటి దేశాన్నే చూస్తోందంటే ఇక్కడి అత్యధిక శాతం యువత వల్లే. ఫిన్లాండ్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. 55 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలోని ప్రభుత్వం.. ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సులభతరం చేస్తోంది. ఇప్పుడున్న ఇమ్మిగ్రేషన్ స్థాయిని రెట్టింపు చేసి ఏడాదికి 20 వేల నుంచి 30 వేల మందికి ఆహ్వానం పలుకుతోంది. ఇక్కడి జీవన ప్రమాణాలు, స్వేచ్ఛ, లింగ సమానత్వం, అతి తక్కువ అవినీతి, తక్కువ నేరాలు తక్కువ కాలుష్యం.. ఫిన్లాండ్‌ను అత్యంత సంతోషకరమైన దేశంగా మార్చాయి.
అయితే ఇక్కడి ప్రజల్లో వలస వచ్చే వారిపై ఉన్న వ్యతిరేకత ఫిన్లాండ్ కొంప ముంచుతోంది. బయట వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడి కంపెనీలు కూడా అంత సులువుగా అంగీకరించవు. ఎలాగోలా ఇక్కడి కంపెనీల అవసరాలను తీర్చే ఉద్యోగులు బయటి దేశాల నుంచి వచ్చినా.. వాళ్లు ఎక్కువ కాలం అక్కడ ఉండటం లేదు. ఖర్చు ఎక్కువగా ఉండటం, మరీ చల్లటి వాతావరణం, చాలా కష్టంగా ఉండే అక్కడి భాష ఇమ్మిగ్రెంట్లకు మింగుడు పడటం లేదు.
ఇప్పుడేం చేస్తోంది?
తమ జనాభా, వర్క్‌ఫోర్స్ సమస్య తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న ఫిన్లాండ్.. తమ విధానాల్లో మెల్లగా మార్పులు తీసుకొస్తోంది. కేవలం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న అక్కడి కంపెనీలు కూడా ఇప్పుడు విదేశీ వర్కర్ల కోసం చూస్తున్నాయి. ముఖ్యంగా ఆసియా నుంచి వలసలు పెరగాలని ఫిన్లాండ్ ఆశిస్తోంది. నిజానికి నాలుగేళ్లుగా టాలెంట్ హంట్‌లో ఉన్నా ఇప్పటి వరకూ పెద్దగా ఒరిగిందేమీ లేదు. దీంతో తమ విధానాలను మరింత విస్తృతంగా ప్రపంచ దేశాల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆ దేశం చేస్తోంది. కరోనా మహమ్మారి వెళ్లిపోయిన తర్వాత తమ దేశానికి వలసలు పెరుగుతాయని ఫిన్లాండ్ ఆశిస్తోంది.