కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా మేఘాలయాలో వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు. మేఘాలయా పైనాపిల్స్‌కు రాహుల్ ఫిదా అయ్యారు. రాష్ట్రంలో లభించే పైనాపిల్స్ చాలా రుచిగా ఉన్నాయని కితాబిచ్చారు. యాత్రలో భాగంగా ఇక్కడి పైనాపిల్స్ రుచి చూశామని, రోడ్డు ప్రక్కన తల్లీకూతుళ్లు విక్రయిస్తున్న పైనాపిల్స్ కొన్నామని, తన జీవితంలో ఇంతవరకూ ఇంతటి రుచికరమైన పైనాపిల్స్‌ను చూడలేదని చెప్పుకొచ్చారు. ఆపై తాను వెంటనే తన తల్లికి ఫోన్ చేసి ప్రపంచంలోనే అత్యుత్తమ పైనాపిల్స్ తీసుకువస్తున్నానని చెప్పానని అన్నారు.
అద్భుతమైన రుచి కలిగిన పైనాపిల్స్ ప్రపంచం అంతటా ఎందుకు అందుబాటులో ఉండటం లేదని ప్రశ్నించారు. ఈ పైనాపిల్స్‌ను ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ ఇక్కడి రైతులు ఎందుకు లాభపడటం లేదని అన్నారు. మౌలిక వసతులు అభివృద్ధి చెందనందునే ఈ పైనాపిల్స్ ప్రపంచానికి చేరడం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. రైతులు, స్ధానిక వ్యాపారులకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ వారి ఉత్పత్తులు ప్రపంచం ముంగిటకు తీసుకువెళ్లేలా నవభారతానికి మనం పునాది వేయాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.