న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రకృతి ఆరాధన, మన సంప్రదాయాలే దేశ సాంస్కృతిక వారసత్వమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావుల కలలను నెరవేర్చడానికి అభివృద్ధి, వికాసానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని పురానా ఖిల్లాలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా సోమవారం ఫోటో ఎగ్జిబిషన్‌ను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలే, సాంస్కృతిక శాఖ అధికారులు, పురావస్తు శాఖాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది హెరిటేజ్ అండ్ క్లైమేట్ థీమ్‌తో ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తున్న తరుణంలో సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పెరుగుతోందని అన్నారు. భారతదేశంలో 40 ప్రపంచ వారసత్వ ప్రదేశాలుండగా, అందులో 32 సాంస్కృతిక ప్రదేశాలు, 7 సహజసిద్ధ ప్రదేశాలు, ఒక మిశ్రమ వర్గానికి చెందిన ప్రదేశం ఉందని చెప్పుకొచ్చారు. వీటిలో 24 స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలను భారత పురావస్తు శాఖ పరిరక్షిస్తోందని ఆయన తెలిపారు. 13వ శతాబ్దంలో కాకతీయ శైలిలో నిర్మించిన అద్భుత రామప్ప ఆలయం, పురాతన హరప్పా నగరం ధోలవ్‌బిరాను 2021 ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్టు కేంద్రమంత్రి గుర్తు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..