నేడు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తృతంగా పెరుగున్న వ్యాధుల్లో హెపటైటిస్ కూడా ఒకటి. ప్రతి ఏడాది ఎందరో మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో 10వ స్థానంలో హెపటైటిస్ ఉంది. హెపటైటిస్ అనేది కాలేయ సంబంధ వ్యాధి. కాలేయం అనగానే మందు తాగడం వల్లే వస్తుందని అనుకుంటే పొరపాటే. మద్యపానం ఒక కారణమే కానీ అదొక్కటే కాకుండా చాలా రకాల కారణాల వల్ల హెపటైటిస్ సోకుతుంది. జీవనశైలిలో మార్పులు, ఊబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా హెపటైటిస్ రావడానికి కారణం అవుతున్నాయి. కాలేయం వాపు చెందడం. రక్తాన్ని శుద్ధి చేసిన మలినాలను బయటకి పంపే కాలేయం సరిగ్గా పనిచేయకపోవడం, వాపు చెంది ఇబ్బందులను కలిగించడాన్నే హెపటైటిస్ అంటారు. ఇందులో A, B, C, D, E అనే రకాలు ఉన్నాయి.
హెపటైటిస్ A
ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపించే ఈ వైరస్, కలుషిత నీటివల్ల శరీరంలోకి ప్రవేశిస్తుంది. వికారం, వాంతులు, విరేచనాలు, తక్కువ జ్వరం, కాలేయ ప్రాంతంలో నొప్పి లక్షణాలుగా కనిపిస్తాయి.
హెపటైటిస్ B
రక్త మార్పిడి, వీర్యం, శరీర సంపర్కం మొదలగు వాటివల్ల ఇతరులకు సోకుతుంది. తల్లి నుండి పుట్టిన బిడ్డకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. శరీరంలో హెపటైటిస్ ఆరు నెలల కంటే ఎక్కువగా నిద్రాణమై ఉంటుంది. అప్పటి వరకూ ఎలాంటి లక్షణాలు కనిపించవు. విపరీతమైన అలసట, ఆకలి లేకపోవడం, కామెర్లు, కాలేయ ప్రాంతంలో నొప్పి, వికారం వంటివి లక్షణాలుగా ఉంటాయి.
హెపటైటిస్ C
ఈ వైరస్ సోకిన వ్యక్తితో సంపర్కం చేస్తే అవతలి వారికి సోకే అవకాశం ఉంది. హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఎటువంటి లక్షణాలను చూపించదు. అందువల్ల కాలేయం పాడవుతుంది. హెపటైటిస్ మరణాల్లో ఎక్కువ శాతం సి వైరస్ కారణంగానే ఉంటున్నాయి.
హెపటైటిస్ D,E
బి వైరస్ ఉన్నవారిలో ఇది వ్యాపించే అవకాశం ఎక్కువ. కలుషిత నీటివల్ల హెపటైటిస్ ఈ సోకుతుంది.
నివారణ
హెపటైటిస్ బారిన పడకూడదు అని భావిస్తే కలుషిత నీరు తాగవద్దు. ఇంజక్షన్ తీసుకున్నప్పుడు కొత్త సిరంజి వాడుతున్నారా లేదా అనేది చెక్ చేయడం తప్పనిసరి. పిల్లలకు హెపటైటిస్ బి టీకాలు వేయడం మంచిది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.
ఈ వార్త కూడా చదవండి: ఏపీలో కొత్తగా 2010 కరోనా కేసులు