Friday, November 22, 2024

వరల్డ్ ఫుడ్ డే ఎలా మొదలైంది? ఎప్పుడు మొదలైంది?

మనం ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా మన పొట్ట నింపుకోవటానికే. అందుకే కోటి విద్యలు కూటి కొరకే అని పెద్దలు అన్నారు. మనిషికి ఆహారం చాలా ముఖ్యమైనది. అది లేకుండా మనిషి ఒకరోజు కూడా జీవించలేడు. అయితే చాలా మంది సంపాదన మాయలో పడి తినడం మానేస్తున్నారు. కొంతమంది అయితే డైటింగ్ పేరుతో కడుపు నిండా తినకుండా జీవించేస్తున్నారు. అలాంటి వారు బర్గర్, పిజ్జాలతో కాలం వెల్లదీస్తున్నారు.

ఇల్లు కాలి ఒకడు ఏడిస్తే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చాడనే సామెత తిండి విషయంలో సరిగ్గా సరిపోతుంది. డబ్బు ఉన్నోళ్లు సరైన ఆహారం తినకుండా జబ్బులు పడుతుంటే.. డబ్బులు లేని వారు ఆహారం దొరక్క అనారోగ్యం పాలవుతున్నారు. మన దేశంలో తినేందుకు ఆహారం లేక పస్తులతో గడుపుతున్న జనాలు కోట్లలోనే ఉన్నారు. చాలా మంది పోషకాహారం తినకపోవడం వల్ల మరణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ప్రతి ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. దీని ఉద్దేశం ప్రతి మనిషికి ఆహారం విలువను తెలియజేయడమే.

ప్రపంచంలో ఈ భూమిపై నివసించే ప్రతి మనిషికి పోషకాహారం లభించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి 1945లో అక్టోబర్ 16న ఆహార వ్యవసాయ సంస్థను ప్రారంభించింది.  ఆ సంస్థ ఆహారం విషయంలో ప్రజల్లో చైతన్యం నింపాలనే ఉద్దేశంతో 1979లో అక్టోబర్ 16వ తేదీని ప్రపంచ ఆహార దినంగా ప్రకటించింది. దీంతో 1981 నుంచి చాలా దేశాలు ఈ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాయి. ప్రస్తుతం 150 దేశాల్లో ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకుంటున్నారు. యునైటైడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎవో) ప్రతి ఏడాది 9 కోట్ల మంది అన్నార్థుల ఆకలి తీరుస్తోంది.

కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై అవగాహన కాస్తైనా పెరిగింది. పోషకాహారాన్ని తీసుకోవాల్సిన ప్రాధాన్యతను అది నొక్కి చెబుతోంది. అయితే అందరికీ మూడు పూటలా ఆహారం లభించడం లేదని మన కళ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16న మనం జరుపుకుంటున్న ప్రపంచ ఆహార దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

భారత పోషకాహార సంస్థ చెప్పిన ప్రకారం.. భారతీయులు ప్రతిరోజూ కనీసం 400 గ్రాముల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. కానీ ఎంత మంది ఇలా తింటున్నారని అడిగితే సమాధానం చెప్పడం కష్టమే. తినే ఆహారంలో కొవ్వులు, చక్కెర, ఉప్పు వాడకాన్ని కూడా తగ్గించాలి. వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. మొత్తం ఈ భూమ్మీద మనిషి తినగలిగే మొక్కల జాతులు 30వేలు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. కానీ అందులో మనం 12వేలు మాత్రమే తినగలుగుతున్నాం. బార్లీ, బీన్స్, వేరుశనగ, మొక్కజొన్న, వరి, జొన్నలు, గోధుమలు వంటివి రోజూవారీ ఆహారంలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

- Advertisement -

గత మూడేళ్లలో ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
అధికారిక లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 13 కోట్లకు పైమాటే. పోషకాహార లోపం, ఆహార భద్రత లేని వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. ఆఫ్రికన్, మద్యాసియా దేశాల్లో అంతర్యుద్ధాల కారణంగా అక్కడ ఆకలి సమస్య తీవ్రమవుతున్నది. మన దేశంలోనూ చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. మనం తినంగా మిగిలిన ఆహారాన్ని వృథా చేయకుండా.. ప్యాకింగ్ చేసి అన్నార్థులకు అందించడం ద్వారా వారి కడుపు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రపంచంలో ఆహార వృథా అధిక స్థాయిలో ఉందని ఐక్యరాజ్యసమితి చెప్తోంది. మన దేశంలో ఏటా 6.8 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది యూకేలోని జనాభా మొత్తానికి సరిపడా ఆహారం అని వారు అంటున్నారు. వృథా అవుతున్న ఆహారం విలువ 1400 కోట్ల డాలర్లకు సమానం అంట.

Advertisement

తాజా వార్తలు

Advertisement