హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని బీసీ విద్యార్ధులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఉన్నత విద్యావంతుడు కాబట్టే బీసీ వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ఆయన వెల్లడించారు. బీసీ విద్యార్థుల కోసం రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం బీసీ సంక్షేమ గురుకులాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌కు పంపాల్సిన ప్రతిపాదనలపై మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 281 బీసీ గురుకులాలు ఉన్నాయని తెలిపారు. అందులో 143 పాఠశాలలు, మరో 119 పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయని పేర్కొన్నారు. బీసీ గురుకులాల్లో 1,52,440 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్తగా మరో 33 గురుకులాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. కొత్త గురుకులాల ద్వారా మరో 7,920 మందికి విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వీటి ద్వారా 3,600 మంది ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరో 21 స్టడీ సర్కిళ్ళ ఏర్పాటుకు కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలో కావల్సిన నైపుణ్యాల కోసం ఇక్కడ శిక్షణ అందించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి కమలాకర్ ఆదేశించారు. ఇదిలావుండగా బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం తగదని అధికారులకు ఆయన సూచించారు.
కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల పత్రాలు..
ఈ నెల 8వ తేదీన ఏక సంఘంగా ఏర్పాడిన ఆరు బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల మంజారు పత్రాలను అందజేస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బీసీ కులాల ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన కోకాపేట, ఉప్పల్ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను బీసీ ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించామని ఆయన చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.