ఐమ్‌చెస్ ర్యాపిడ్ ఆన్‌లైన్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు భారత గ్రాండ్ మాస్టర్ షాకిచ్చాడు. ఏడు రౌండ్ల టోర్నీలో భారత మాస్టర్ అర్జున్ ఎరిగైసీ మాగ్నస్‌ను ఓడించి సంచలనం సృష్టిం చాడు. ఆదివారం సాధించిన ఈ విజయంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. టోర్నీ ప్రారంభంలో స్వదేశీ ప్లేయర్ విదిత్ సంతోష్ చేతిలో ఓడిన 19 ఏళ్ల అర్జున్, ప్రస్తుతం ఎనిమిది రౌండ్ల అనంతరం ఐదవ స్థానంలో ఉన్నాడు. ఆదివారం ప్రారంభమైన ఏడవ రౌండ్‌లో నార్వేజియన్ సూపర్‌స్టార్ కార్ల్‌సన్‌పై అర్జున్ సాధించిన విజయం ప్రపంచ చాంపియన్‌పై భారత్‌కు తొలి గెలుపుగా నిలిచింది. మూడు వరుసగేమ్‌లలో నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), డేనియల్ నరోడిట్స్‌కీ (అమెరికా), కార్ల్‌సన్ (నార్వే)ను అర్జున్ ఎరిగైసి ఓడించాడు. జాన్-క్రిస్టోఫ్‌దుడా (పోలాండ్)తో గేమ్‌ను డ్రాగా ముగించాడు.
ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ కు చెందిన అబ్దుసట్లోరోవ్ (17 పాయింట్లు), షాక్రియార్ మెద్యరోవ్ (అజర్‌బైజాన్) 16, కార్ల్‌సన్ 16 మొదటి మూడు స్థానాల్లో ఉండగా, దుడాతో సమానంగా 15 పాయింట్లు సాధించిన అర్జున్ ఎరిగైసి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. గత నెలలో జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్‌లైన్ టోర్నీ ఫైనల్‌లో కార్ల్‌సన్ చేతిలో 5-4 మూవ్‌లతో ఓటమి పాలైన అర్జున్ ఇప్పుడు బదులు తీర్చుకున్నాడు. మరో భారత ఆటగాడు డి.గుకేష్ ప్రిలిమినరీస్‌లో 12 పాయింట్లతో ఆరవ స్థానంలో ఉన్నాడు.