రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆర్థికంగా ఎంతో నష్టపోయిన ఉక్రెయిన్‌కు ప్రపంచ బ్యాంకు భారీ ప్యాకేజీని ప్రకటించింది. 3 బిలియన్ డాలర్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు బుధవారం తెలిపింది. ఇందులో కనీసం 350 మిలియన్ డాలర్లను తక్షణ సాయం కింద అందజేసినట్టు వివరించింది. సాయానికి సంబంధించిన తొలి విడతను ఈ వారంలోనే ఆమోదం కోసం బోర్డు ఎదుట ప్రపంచ బ్యాంకు ఉంచనుంది. ఆ తరువాత ఆరోగ్యం, విద్య కోసం 200 మిలియన్ డాలర్లను వెంటనే అందించేందుకు నిర్ణయించినట్టు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్సాస్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివాలు సంయుక్తంగా ప్రకటించారు.
ఉక్రెయిన్‌కు మరింత సాయం చేస్తామని కొన్ని రోజుల క్రితమే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు నిర్ణయించాయి. అందుకు అనుగుణంగా చేసిన వాగ్ధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి కదులుతున్నాయి. జూన్ వరకు ఉక్రెయిన్‌తో 2.2 బిలియన్ల ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్‌ను ఐఎంఎఫ్ కలిగి ఉంది. అత్యవసర ఫైనాన్సింగ్ కోసం దేశ తాజా అభ్యర్థనను వచ్చే వారంలో ప్రారంభించేందుకు పరిశీలిస్తున్నట్టు ఐఎంఎఫ్ తెలిపింది. ప్రపంచ సంక్షోభ రుణదాతల నేతలు, రష్యా తన పొరుగు దేశంపై దాడి చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. యుద్ధం తీసుకొచ్చిన వినాశకరమైన మానవ, ఆర్థిక నష్టాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు ప్రకటించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..