భారత్ వృద్ధిరేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ సవరించింది. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గా రాణిస్తుండటంతో గతంలో వేసిన 6.5 శాతం వృద్ధిరేటు అంచనాను 6.9 శాతానికి పెంచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్ధిక వ్యవస్థ అంతర్జాతీయ పరిణామాలను తట్టుకుని రాణిస్తోందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఈ సంవత్సరం అక్టోబర్లో జీడీపీ వృద్ధిరేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. ప్రపంచ పరిణామాలు ఏ మాత్రం సానుకూలంగా లేనప్పటికీ రెండో త్రైమాసికంలో భారత్ మెరుగైన గణాంకాలను నమోదు చేసింది.
దీంతో జీడీపీ వృద్ధిరేటు అంచనాలను పెంచినట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఈ ఆర్ధిక సంవత్సరం ద్రవ్యోల్బణం 7.1 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. భారత్ స్థూల ఆర్ధిక ప్రాథమిక అంశాలు బలంగా ఉండటంతో ప్రపంచ పరిణామాలను తట్టుకుని నిలదొక్కుకుందని ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ట్రేడర్స్, సంస్థల కన్ను పడని అతి పెద్ద దేశీయ మార్కెట్ ఉండటం కూడా ఇందుకు కారణమని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీని వల్లే అంతర్జాతీయ పరిస్థితులు సానుకూలంగా లేనప్పటికీ దాని ప్రభావం నేరుగా మన ఆర్ధిక వ్యవస్థపై పడటంలేదు. విధానపరమైన సంస్కరణలు, నియంత్రణ వ్యవస్థలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.