Sunday, November 17, 2024

TS | సమన్వయంతో పని చేయండి.. అధికారులతో డీజీపీ రవిగుప్తా

తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఐపీఎస్ ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్ల మండలం చెన్నాపురం, పుసుగుప్ప, ఉంజూపల్లిలోని పోలీస్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపులను సందర్శించారు. క్యాంపు సందర్శనలో భాగంగా అక్కడ పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి డీజీపీ పలు సూచనలు చేశారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుని.. అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టుల వల్ల రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో డీజీపీతోపాటు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్, గ్రేహౌండ్స్ అదనపు డీజీ విజయ్ కుమార్ ఐపీఎస్, సీఆర్పీఎఫ్ సౌత్ జోన్ అదనపు డీజీపీ రవిదీప్ సింగ్ సాహి, సీఆర్‌పీఎఫ్ సౌత్ సెక్టార్ హైదరాబాద్ జోన్ ఐజీపీ చారుసిన్హా ఐపీఎస్, ఎస్‌ఐబీ ఐజీపీ సుమతి తదితరులు పాల్గొన్నారు.

ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి…

అనంతరం హెలికాప్టర్‌లో సారపాక ఐటీసీగెస్ట్ హౌస్ కి చేరుకుని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూడు జిల్లాల ఎస్పీలను ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్క రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం చేసుకుంటూ పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.

చెక్‌పోస్టుల వద్ద పనిచేసే అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ… నగదు, మద్యం అక్రమ తరలింపును అరికట్టాలన్నారు. గత ఎన్నికల మాదిరిగానే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం డీజీపీతో పాటు అధికారులంతా భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు.

- Advertisement -

ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్, ములుగు ఎస్పీ డా.శబరీష్ ఐపీఎస్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరే ఐపీఎస్, ఎస్‌ఐబీ ఎస్పీ రాజేష్, ఓఎస్‌డీ కొత్తగూడెం సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్, ఏటూరునాగారం ఏఎస్పీ మహేశ్ జితే ఐపీఎస్, ట్రైనీ సీపీఎస్ అధికారి విక్రాంత్ సింగ్, సీఆర్‌పీఎఫ్ అధికారులు ఆర్. కే పాండా, ఎంకే మీనా, మోహన్, రితేష్ కుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement