హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయించే విషయంలో ఐటీ కంపెనీలతో కోవిడ్ దోబూచులాడుతోంది. కోవిడ్ రెండో వేవ్ ముగిసిన తర్వాత ఈ ఏడాది ప్రారంభం నుంచి ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయించాలనుకున్న కంపెనీల ఆశలపై ఒమిక్రాన్ థర్డ్ వేవ్ నీళ్లు చల్లిన విషయం తెలిసిందే. థర్డ్‌వేవ్ ప్రభావం పెద్దగాలేదని నిర్ధారించుకున్న అనంతరం ప్రస్తుతం ఆయా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి సిద్ధమవుతున్న తరుణంలో తాజాగా దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఉద్యోగులను పూర్తిస్థాయిలో ఆఫీసులకు పిలిపిస్తే ఫోర్త్‌వేవ్ కరోనా ఉద్ధృతంగా ఉంటే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని, వర్క్‌ఫ్రమ్‌ఆఫీసుపై కంపెనీలు మళ్లీ వేచి చూసే ధోరణని అవలంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు పలు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు.
కరోనా కారణంగా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ఐటీ కంపెనీల్లో లక్షల సంఖ్యలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు కరోనా తొలిసారి ప్రవేశించిన ప్పటి నుంచి రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోం విధానంలో ఇంటి నుంచే పనిచేస్తున్నారు. రాష్ట్రంలో రెండు డోసుల వ్యాక్సినేషన్ దాదాపు పూర్తయి ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడడంతో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఆఫీస్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా దేశరాజధాని ఢిల్లిdలో కొవిడ్ కేసులు పెరుగుతుండడం, చైనాలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తుండడంతో ఐటీ ఉద్యోగుల వర్క్ ఫ్రం ఆఫీసు విధానం పునరుద్ధరణ తాజాగా ప్రశ్నార్ధకంలో పడిందని పలు కంపెనీల హెచ్‌ఆర్ విభాగం బాధ్యులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో సుమారు 1200 సాఫ్ట్‌వేర్ సంస్థలు ఉండగా వీటిలో 6 లక్షల మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 90 శాతానికిపైగా ఉద్యోగులు కరోనా కారణంగా ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ విధానంలో ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు.
కాగా, రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ దాదాపు పూర్తవడంతో థర్డ్‌వేవ్‌కు ముందు తెలంగాణ ప్రభుత్వం కూడా ఐటీ ఉద్యోగులకు భరోసా ఇచ్చింది. ఆఫీసుల నుంచి పనిచేయాలని ప్రోత్సహించింది. ఐటీ కంపెనీలు కొవిడ్‌కు ముందులా పనిచేయడం కేవలం ఐటీ కంపెనీలకే కాకుండా, ఐటీ ఉద్యోగులు గతంలోలా ఆఫీసుల నుంచి విధులు నిర్వహిస్తే హైదరాబాద్ నగరంలో పరోక్షంగా వారిపై ఆధారపడ్డ ఎంతోమంది ఉపాధి పొందుతారనేది ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఐటీ ఉద్యోగులను ఆఫీసులకు తరలించే ట్రాన్స్‌పోర్ట్ రంగంలోని వారు, ఆయా కంపెనీల్లో కిచెన్‌లు నిర్వహించే క్యాటరర్స్, హౌజ్‌కీపీంగ్ సేవలందించే వెండర్‌లతో పాటు ఐటీ పరిశ్రమ మీద ఆధారపడి వ్యాపార కార్యకలాపాలు సాగించే పలు రకాల వెండార్లు, ఆయా వెండర్ సంస్థల్లో పనిచేసే లక్షలాది మందికి మళ్లి పూర్తిస్థాయిలో ఉపాధి లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్యలో పెరుగుదల అంతగా ఆందోళనకరంగా లేకపోవడంతో ఐటీ కంపెనీలు తగు జాగ్రత్తలు తీసుకుని తమ కార్యాలయాలు తిరిగి ప్రారంభించడానికి ఇది సరైన సమయమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
హైబ్రిడ్ పద్ధతే దిక్కు…
కరోనా కారణంగా రెండేళ్లకుపైగా వర్క్ ఫ్రం హోం విధానంలోనే విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్ నగరానికి చెందిన ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది హైబ్రిడ్ విధానంలోనే ఆఫీసుల నుంచి విధులు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నారని ఇటీవల పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. ఈ విధానంలో కార్యాలయంలోని ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫీసు నుంచి లేదంటే ఇళ్ల నుంచి పనిచేసేలా వెసులుబాటు ఉంటుంది. ఫోర్త్‌వేవ్ కరోనా ప్రమాదం పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో హైబ్రిడ్ విధానంలో పనిచేసే వెసులుబాటును కంపెనీలు కలిగిస్తే ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేయడానికి సిద్ధమవుతారని పలువురు ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి… ఎక్కువ కాలంపాటు ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం సరికాదని, దీనివల్ల వారిలో సృజనాత్మకత బయటికి రాదని భారత రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి ఇటీవల అభిప్రాయపడ్డారు. అనంతరం ఆ కంపనీకూడా ఉద్యోగులను ఆఫీసులనుంచి విధులు నిర్వహింపజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇంతలో కోవిడ్ ఫోర్త్‌వేవ్ ఊహాగానాలు వస్తుండడంతో ఆ కంపెనీ కూడా ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌ఆఫీసుపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..