సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన వండర్ బేబీ ఉపాసన, ఆమె తల్లిదండ్రులు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రెండున్నర సంవత్సరాల బేబీ ఉపాసన తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో ప్రతిభా పాటవాలతో నోట్ బుక్ ఆఫ్ రికార్డ్స్, సూపర్ టాలెంటెడ్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటి అనేక ప్రతిష్టాత్మక సంస్థల చేత గుర్తించబడింది.
మహనీయుల పేర్లు, వారి చిత్ర పటాలను, దేశ, ప్రపంచ రాజధానులను గుర్తుంచుకోవడం లాంటి అనేక అంశాల్లో చిన్నారి ఉపాసన అద్భుతమైన ప్రజ్ఞను కలిగి ఉంది. ఈరోజు కేటీఆర్ గారిని కలిసిన సందర్భంగా తెలంగాణతో కేసీఆర్ చిత్రపటానికి చెందిన పజిల్ ను వేగంగా సాల్వ్ చేసి చూపించింది.
బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడే బేబీ ఉపాసన ప్రజ్ఞా పాటవాలను చూసి కేటీఆర్ తో పాటు పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేసీఆర్ తాతను కలిసి మాట్లాడతా అంటూ బేబీ ఉపాసన తన ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఇంత చిన్న వయసులో మహనీయుల పేర్లు, చిత్రపటాలతో పాటు భౌగోళిక అంశాల పైన ఆమెకున్న జ్ఞాపకశక్తిని, టాలెంట్ ని చూసి కేటీఆర్ ఆశ్చర్యపోయారు.
బేబీ ఉపాసన భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరాలని దీవించారు. బేబీ ఉపాసన సాధించిన రికార్డుల పత్రాలపైన ఆమె తల్లిదండ్రులు కేటీఆర్ సంతకాన్ని ఒక జ్ఞాపకంగా తీసుకున్నారు. బేబీ ఉపాసనకు కేటీఆర్ దీవెనలతో పాటు మిఠాయిలు అందించారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.