మలేషియా మాస్టర్స్ సూపర్ 500లో తెలుగుతేజం హెచ్‌ఎస్ ప్రణయ్ చరిత్ర సృష్టించాడు. కౌలాలంపూర్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనా ప్లేయర్ వెంగ్ హాంగ్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. తద్వారా భారత ఏస్ షట్లర్ తన కెరీర్‌లో మొట్టమొదటి బిడబ్ల్యుఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 94 నిముషాలపాటు హోరాహోరీగా సాగిన పోరులో, ప్రణయ్ అసాధారణ ఆటతీరును ప్రదర్శించాడు. ప్రపంచ ర్యాంకులో 34వ స్థానంలో ఉన్న తన చైనా ప్రత్యర్థిని 21-19, 13-21, 21-18 తేడాతో ఓడించాడు. ట్రోఫీతోపాటు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ అందుకున్నాడు.
2017 యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్‌లో విజయం సాధించిన తర్వాత, వ్యక్తిగత టైటిల్ కోసం అతని నిరీక్షణ ఇన్నేళ్లకు ఫలించింది. పైగా ఈ టోర్నీ ప్రారంభించిన (2009) తర్వాత పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారత షట్లర్ కూడా ప్రణయ్ కావడం విశేషం. 30 ఏళ్ల ప్రణయ్, గతేడాది స్విస్ ఓపెన్‌లో టైటిల్‌కు చేరువగా వచ్చి ఓటమిపాలయ్యాడు. మలేషియా మాస్టర్స్, ఇండోనేషియా సూపర్ 1000 టోర్నీలలో సెమీఫైనల్స్‌కు చేరినా టైటిల్ ఆశ నెరవేరలేదు. అయితే, ఈ సారి మలేషియా మాస్టర్స్ సూపర్ 500లో ఈ నిరీక్షణ ఫలించింది.
కాగా ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మరో ఇద్దరు షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్ నిరాశపరిచారు. మహిళల సింగిల్స్‌లో పతకంపై ఆశలు రేపిన సింధు సెమీఫైనల్‌లో ఓడింది. జార్జియా మరిస్కా తుంజంగ్ చేతిలో 14-21, 17-21 స్కోరుతో వరుస సెట్లలో ఓడింది. ఇక కిదాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్‌లోనే ఇంటిదారిపట్టాడు.